‘పరిషత్’ ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:59 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనున్నారు.
‘పరిషత్’ ఎన్నికలకు సర్వం సిద్ధం
8చోట్ల స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు
ఓట్ల లెక్కింపూ అక్కడే
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కలెక్టర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం విడుదల చేయనున్నారు.నామినేషన్ల ఘట్టం బుధవారం ప్రారంభమై ఈనెల 23వ తేదీతో ముగియనుంది. నవంబరు మూడో తేదీన పోలింగ్ ఉంటుంది. అదే రోజు రాత్రి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి, భద్రపరుస్తారు. 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఎనిమిది చోట్ల స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంతోపాటు వడమాలపేట, పుత్తూరు మండలాలకు సంబంధించిన స్ర్టాంగ్ రూమ్ను తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలలో ఏర్పాటు చేశారు. కోడూరు నియోజకవర్గానికి కోడూరులోని హార్టికల్చరల్ కళాశాలలో, శ్రీకాళహస్తికి స్కిట్ కళాశాలలో, సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు మండలాలకు పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో, బీఎన్కండ్రిగ, సత్యవేడు మండలాలకు సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని డీవీసత్రం, తడ, సూళ్లూరుపేటకు సూళ్లూరుపేటలోని ప్రభుత్వ కళాశాలలో, నాయుడుపేట, వాకాడు, చిట్టమూరు మండలాలకు నాయుడుపేట జడ్పీ హైస్కూల్లో, వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాలకు వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాలలో స్ర్టాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. స్ర్టాంగ్ రూమ్ల వద్దే ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై రెండ్రోజులుగా జేసీ గోవిందరావు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకా్షరెడ్డి, దేవేంద్రరెడ్డితోపాటు డీడీవోలు సుష్మ, గంగాభవాని, పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక జడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను తిరుపతిలోని జడ్పీ కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థులు మాత్రం ఆయా మండలకేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో దాఖలు చేయాలి. అవసరమైన ఎన్నికల సామగ్రిని శనివారం ఆయా కేంద్రాలకు తరలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలకు సోమవారం కలెక్టరేట్లో శిక్షణ తరగతులు ఉంటాయని జడ్పీ అధికారులు తెలిపారు.