తొలి విడత పల్లెపోరుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 23 , 2026 | 01:02 AM
జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో డీపీవో సుశీలాదేవి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవగా అప్పీళ్ల తర్వాత శనివారం తుది జాబితా ప్రకటించారు. రైల్వేకోడూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని 16మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి
బరిలో సర్పంచులు 268మంది,
వార్డు మెంబర్లు 1,596మంది
26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
రేపు పోస్టల్ బ్యాలెట్
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో డీపీవో సుశీలాదేవి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవగా అప్పీళ్ల తర్వాత శనివారం తుది జాబితా ప్రకటించారు. రైల్వేకోడూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని 16మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 404 సర్పంచ్ స్థానాలకుగాను 136 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో 268మంది నిలిచారు. 3,684వార్డులకుగాను 2,088 మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు. 1,596మంది పోటీలో ఉన్నారు. వీరికి ఇప్పటికే గుర్తులు కేటాయించారు. ఈనెల 26వ తేదీన ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు.
పోలింగ్ విధుల్లో 8,350మంది
పోలింగ్ విధుల కోసం 8,350మంది ఉద్యోగులను కేటాయించారు. వీరిలో రిజర్వు 20శాతం మంది ఉన్నారు. వీరికోసం మంగళవారం ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పత్రాల తరలింపు
ఓటర్లు సర్పంచ్‌కు, వార్డుమెంబర్లకు వేర్వేరుగా ఓటు వేయాలి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం 28 లక్షల బ్యాలెట్‌పత్రాలను ముద్రించారు. సర్పంచ్‌కు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపురంగు బ్యాలెట్‌పత్రాలను ఓటర్లకు ఇవ్వనున్నారు. కలెక్టరేట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఆదివారంపోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ పత్రాలను ఆయా మండలకేంద్రాలకు ఎంపీడీవోలు తరలించారు. ఓటర్ల ఎడమచేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలన్ని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీసీ కెమెరాల నిఘా నడుమ ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
26న స్థానిక సెలవు దినం
పోలింగ్ జరిగే 26వతేదీని స్థానిక సెలవు దినంగా కలెక్టర్ ప్రకటించారు. అలాగే పోలింగ్ కేంద్రాలుండే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు ముందు రోజుకూడా సెలవు ఇచ్చారు.