Share News

పసుపు పండుగకు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 27 , 2026 | 12:42 AM

టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈసారి వర్చువల్‌ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని అన్ని క్లస్టర్లలో మహానాడు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేసుకున్నారు.

పసుపు పండుగకు సర్వం సిద్ధం
శాంతిపురంలోని బాలాజీ కల్యాణ మండపంలో మహానాడు బ్యానర్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌

ప్రతి క్లస్టర్‌ నుంచీ 500 మంది పాల్గొనే అవకాశం

రెండు రోజుల పాటు అందుబాటులో ఎమ్మెల్యేలు

ఎంపీ దగ్గుమళ్ల కేంద్ర కార్యాలయం నుంచి..

చిత్తూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈసారి వర్చువల్‌ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని అన్ని క్లస్టర్లలో మహానాడు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేసుకున్నారు. నారా లోకేశ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కావడంతో ఆ పార్టీ శ్రేణులు దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేరుగా మహానాడు నిర్వహిస్తే కలిసే అనుభూతియే వర్చువల్‌ విధానంలో కలిగేలా ప్లాన్‌ చేసుకున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ..

చిత్తూరు పార్లమెంటు పరిధిలో 78 క్లస్టర్లున్నాయి. చంద్రగిరి, చిత్తూరు, కుప్పం నియోజకవర్గాల్లో 12 చొప్పున, నగరి, పలమనేరులో 10 చొప్పున, జీడీనెల్లూరు, పూతలపట్టులో 11 చొప్పున క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టరులో సుమారు 20- 25 వేల మంది ఓటర్లు, సుమారు 15- 20 గ్రామ పంచాయతీలుంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరిగే కార్యక్రమాలను చూసేందుకు వీలుగా ప్రతి క్లస్టరులోనూ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టరులో 500 మంది పాల్గొనే అవకాశముంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆయా క్లస్టర్లలో మహానాడు సమావేశాలు జరగనున్నాయి.

నియోజకవర్గానికో పరిశీలకుడు

మహానాడు నిర్వహణకు నియోజకవర్గానికో పరిశీలకుడ్ని నియమించారు. చంద్రగిరికి పనబాక భూలక్ష్మి (రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి), నగరికి తులసి (రాష్ట్ర కార్యదర్శి), జీడీనెల్లూరుకు జయప్రకాష్‌ (కడప డీసీఎంఎస్‌ చైర్మన్‌), చిత్తూరుకు పి.కుమారి (రాష్ట్ర కార్యదర్శి), పలమనేరుకు అనితాదీప్తి (రాష్ట్ర కార్యదర్శి), పూతలపట్టుకు బొమ్మన శ్రీధర్‌ (బెస్త కార్పొరేషన్‌ చైర్మన్‌)లను నియమించారు. కుప్పం నియోజకవర్గానికి నియమించలేదు.

ఎవరెవరు ఎక్కడి నుంచి....

ఆయా ఎమ్మెల్యేలు బుధ, గురువారాల్లో వారి నియోజకవర్గాల్లో జరిగే మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 10-11 క్లస్టర్లు ఉండగా, రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముగరెడ్డి చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే చిత్తూరు రెండో క్లస్టర్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాలకు కూడా వెళ్తారు. గురువారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో జరిగే 7వ క్లస్టర్‌ (గుడిపాల) మీటింగులో పాల్గొని, తర్వాత గుడుపల్లె మండలానికి వెళ్తారు. ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌ తవణంపల్లె క్లస్టర్‌లో పాల్గొంటారు.

జిల్లా నుంచి కేంద్ర కార్యాలయానికి..

మహానాడులో అన్ని జిల్లాల నాయకులకూ ఆయా అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈసారి వర్చువల్‌ విధానం కావడంతో పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు మాత్రమే కేంద్ర కార్యాలయం నుంచి పాల్గొనాలని సూచనలు అందాయి. దీంతో పొలిట్‌బ్యూరో మెంబర్‌, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పాల్గొంటారు. నగరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి మీరా, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ నాగేశ్వరరాజు కూడా కేంద్ర కార్యాలయం నుంచి ఆయా అంశాల మీద ప్రసంగించనున్నారు. అమరనాథ్‌రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోనే ఉంటారు.

Updated Date - May 27 , 2026 | 12:42 AM