గరుడ సేవకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:53 AM
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడసేవకు తిరుమల సిద్ధమైంది.ఈ వాహన సేవను తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ,జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. శనివారం గరుడ సేవ జరగడం ఒక విశేషమైతే పెరటాసి మాసం ప్రారంభమైన తర్వాత తొలి శనివారం ఇదే రోజు రావడం గమనార్హం.
తిరుమల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడసేవకు తిరుమల సిద్ధమైంది.ఈ వాహన సేవను తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ,జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. శనివారం గరుడ సేవ జరగడం ఒక విశేషమైతే పెరటాసి మాసం ప్రారంభమైన తర్వాత తొలి శనివారం ఇదే రోజు రావడం గమనార్హం. దీంతో తమిళులు పెద్ద సంఖ్యలో గరుడ సేవకు హాజరయ్యే ఆస్కారం ఉందని భావిస్తున్న అఽధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టారు.
తిరుమల ఆలయం చుట్టూ మాడవీధుల వెంట ఉన్న గ్యాలరీల్లో సుమారు 1.20లక్షల మంది పట్టే ఆస్కారం ఉంది. మరింత మంది భక్తులకు వాహన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వాహన మండపం నుంచి స్వామి తొలుత శ్రీవారి ఆలయం ఎదురు నుంచి మాడ వీధుల్లో విహరిస్తారు. దీంతో స్వామి వాహనం హథీరాంజీ మఠం దాటిన వెంటనే గొల్లమండపం, అఖిలాండం ముందు భాగంలో ఉన్న భక్తులను ఖాళీ చేయించి మరికొందరు భక్తులతో భర్తీ చేయించనున్నారు. అదేవిధంగా మాడ వీధుల్లో తాళ్లు వేసి స్వామి పక్క నుంచి మరికొందరు దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. సుపథంతోపాటు నైరుతి మూలన ఉన్న గేటు నుంచి స్వామి వాహనం పక్క నుంచి రెండు వరుసలు తాళ్లు వేయనున్నారు. అందులో నుంచి భక్తులను అనుమతించనున్నారు. అదేవిధంగా మేదరమెట్ట, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించి అదనంగా మరికొంతమందికి గరుడ వాహన దర్శనం చేయించనున్నారు.
గరుడ సేవ రోజు ముందురోజు రాత్రి నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులు గ్యాలరీల్లో వేచివుంటారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన అన్నప్రసాదాలను అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. గత ఏడాది గరుడ సేవ రోజున 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో సైతం 30 శాతం అదనంగా స్వామివారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టారు. టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానీయాలను 50 శాతం అదనంగా పెంచుతున్నారు. అన్నదానంలో లక్ష పోర్షన్ల ఆహారం తయారీ కోసం అదనంగా 22 పాత్రలతో ప్రత్యేక కిచెన్‌ను ఏర్పాటు చేశారు.
ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించారు. ప్రస్తుతం రోజుకు వేసే ట్రిప్పులకు అదనంగా మరో 500 వేయనున్నారు. తద్వారా గరుడ సేవ రోజున 3100 ట్రిప్పులు వేసి, భక్తులు ఆర్టీసీని వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. మరోవైపు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు ఘాట్ రోడ్లపై అనుమతి లేదు. దీంతో స్థానికులు అనేకమంది ఆర్టీసీని వినియోగించుకుంటారు. మరోవైపు తిరుపతి, తిరుమలలో వాహనాలకు అవసరమైన పార్కింగ్ సదుపాయం కల్పించారు.
గరుడ సేవ రోజున గ్యాలరీలు, రహదారులు అన్నీ నిండిపోయి భక్తులు కొండ మీదకు రాలేని పరిస్థితి ఉన్నపప్పుడు కింద ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రద్దీ విపరీతంగా పెరిగిపోతే భక్తులను తిరుపతిలోని హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉండేలా చర్యలు చేపట్టారు. అక్కడ పెద్ద స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు.
నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచారు. సిగ్నల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిసారించారు. తద్వారా మొబైల్ సేవలకు అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరుమలతోపాటు ఘాట్ రోడ్లలో ఉన్న సెల్‌టవర్ల పనితీరును సమీక్షించారు. భద్రతా సమస్యలు తలెత్తితే వెంటనే సమాచారం చేరవేసే విధంగా ‘జియో టాకీ’లను భద్రతా సిబ్బందికి అందించారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీస్, విజిలెన్స్ యంత్రాంగాన్ని మోహరించారు. భక్తులు క్యూలైన్లు, గ్యాలరీల్లోకి వెళ్లే విధంగా వీరు సహకరించనున్నారు. 3వేల మంది పోలీసులు, 2500 మంది విజిలెన్స్ సిబ్బంది నిత్యం పహారా కాయనున్నారు.