జాతరకు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 12 , 2026 | 02:14 AM
నగరమంతా జాతర సందడి నెలకొంది.అమ్మలగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లుతోంది.సోమవారం పగలంతా గంగమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు.పలువురు ప్రముఖులు సారె సమర్పించారు.
వజ్రకిరీటంలో వెలిగిపోయిన గంగమ్మ
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తిరుపతి సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): నగరమంతా జాతర సందడి నెలకొంది.అమ్మలగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లుతోంది.సోమవారం పగలంతా గంగమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు.పలువురు ప్రముఖులు సారె సమర్పించారు.గంగజాతరకు చాటింపు అనంతరం వివిధ వేషాల్లో మునిగితేలిన గంగమ్మకు సోమవారం అర్ధరాత్రి తరువాత విశిష్ట అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సర్వాలంకారశోభితమైన గంగమ్మకు అర్చకులు వజ్రకిరీటధారణ చేశారు. మంగళవారం జాతర నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే పొర్లు దండాలు పెట్టుకుంటూ, వివిధ రకాల వేషధారణలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
పూజలందుకున్న సున్నపు కుండలు
తిరుపతి గంగజాతరలో సున్నపు కుండలకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహిళలపై అత్యాచారం చేస్తున్న పాలేగాడిని గంగమ్మ సంహరించిన అనంతరం తిరుపతికి మేమున్నాం...అంటూ పెదగంగమ్మ, చిన గంగమ్మ సున్నపు కుండలు కట్టుకుని తిరుపతి అంతా తిరిగి పూజలందుకుంటారు. పాలేగాళ్ల బాధ ఇక మీకుండదని ప్రజలకు భరోసా ఇస్తారు. మహిళలంతా స్వేచ్చావాయువులు పీల్చుకుని అమ్మవార్లను ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. అప్పటి నుంచి తిరుపతి జాతరలో గంగమ్మ వంశస్థులైన కైకాల వంశీకులు ఈసున్నపు కుండల వేషాలను ధరించడం ఆచారంగా వస్తోంది. గంగ జాతరలో భాగంగా సోమవారం సాయంత్రం వేశాలమ్మ ఆలయంలో కైకాల వంశస్థులు ఇద్దరు సున్నపు కుండలను ధరించారు.అక్కడినుంచి ప్రధాన వీధులల్లోని ఇళ్లకు వెళ్లి హారతులందుకున్నారు. సున్నపుకుండల వేషధారులను భక్తులు కుర్చీలో కూర్చోబెట్టి పాదపూజ చేసి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం వేకువజాము వరకు వీళ్లు ఊరంతా తిరిగి పూజలందుకోవడం విశేషం.
నేడు పేరంటాల వేషం
పేరంటాల వేషాన్ని కూడా కైకాల వంశస్థులే ధరిస్తారు. ఎర్రగళ్ల చీరను కట్టి, ఎర్ర గుడ్డలో ఒడిబాలను కట్టుకుంటారు. పంబల వాయిద్యాలతో చాటు మండపం వద్దకు వెళ్లిన తరువాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడినుంచి మరికొన్ని చోట్లకు వెళ్లి పూజలందుకుంటారు.బుధవారం వేకువజామున చిన గంగమ్మ చెంపనరికి ఆ తరువాత పెద గంగమ్మ చెంపను నరకడంతో జాతర సంబరం ముగుస్తుంది.