Share News

కూటమి సభకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:56 AM

తిరుపతి రూరల్‌ మండలం దామినేడు వద్ద శుక్రవారం నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు గురువారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.సుమారు 20ఎకరాల్లో సభా నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. జర్మన్‌షెడ్లతో సభావేదికను తీర్చిదిద్దారు.

కూటమి సభకు సర్వం సిద్ధం
కూటమి విజయోత్సవ సభకు సిద్ధమైన వేదిక, ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులతో కలెక్టర్‌

రెండేళ్ల ప్రగతిని వివరించేలా స్టాళ్లు

30వేలమంది వీక్షించేలా ఏర్పాట్లు

2.30గంటలపాటు సాగనున్న సభ

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 11(ఆంధ్రజ్యోతి):తిరుపతి రూరల్‌ మండలం దామినేడు వద్ద శుక్రవారం నిర్వహించనున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు గురువారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.సుమారు 20ఎకరాల్లో సభా నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. జర్మన్‌షెడ్లతో సభావేదికను తీర్చిదిద్దారు.ప్రధాన వేదిక ఎదురుగా ఇంచుమించు పదివేలమంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇరువైపులా మరో రెండు మినీ వేదికలను కూడా సిద్ధం చేశారు. 30వేలమంది కూర్చుని సభను వీక్షించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేశారు.ప్రధాన వేదికపై మంత్రులు కూర్చుంటారు.వేదికముందు భాగాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ల ఛైర్మన్లకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కూటమి పాలనలో వివిధ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులకు కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, ఎమ్మెల్యేలు నాని, ఆరణి శ్రీనివాసులు దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు మంత్రులు తిరుపతికి చేరుకోగా శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌, కేంద్రమంత్రులు కింజరపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ రానున్నారు.రాష్ట్ర మంత్రులతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు సభకు హాజరవుతున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌, మాధవ్‌,రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ సభలో ప్రసంగించనున్నారు.చంద్రగిరి నియోజకవర్గం నుంచే 15వేలమంది లబ్ధిదారులను సభకు తరలించేందుకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఏర్పాట్లు చేపట్టారు.ఇంకా జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 6వేలమందికిపైగా జనసమీకరణకు ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.సభకు వచ్చే వారందరికీ పసందైన విందు ఇవ్వడానికి ఎమ్మెల్యే పులివర్తి నాని 25 ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.జాతీయ రహదారికి పక్కనే సభ జరుగుతుండడంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా సర్వీసురోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ మార్గం గుండా లబ్ధిదారులను సభకు అనుమతించనున్నారు.కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమంపై వివిధ శాఖాధికారులు సుమారు 20 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదట సీఎం స్టాళ్లను వీక్షించి సభా ప్రాంగణంలోకి వెళ్లనున్నారు.ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే సభ మధ్యాహ్నం 1.30గంటల వరకు జరగనుంది.సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం మంత్రులు అనిత, సత్యప్రసాద్‌, సీఎం కార్యక్రమాల కో-ఆర్టినేటర్‌ పెందుర్తి వెంకటేష్‌, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్‌, ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి పరిశీలించారు.

Updated Date - Jun 12 , 2026 | 01:56 AM