వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:24 AM
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. విద్యుద్దీప కాంతుల్లో ఆలయం వెలుగులీనుతోంది. స్వాగత ఆర్చిలు, అలంకరణలతో కాణిపాకానికి బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. ఆలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. సుమారు లక్ష మంది భక్తులు స్వామి దర్శనానికి రానున్నట్లు అధికారుల అంచనా. అందుకు తగ్గట్టు ప్రత్యేక క్యూలైన్లు, ఏర్పాట్లు చేశారు.
21 రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు
నేడు ఆలయంలో ‘చవితి’ వేడుకలు
రేపు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం
ఐరాల,(కాణిపాకం), సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. విద్యుద్దీప కాంతుల్లో ఆలయం వెలుగులీనుతోంది. స్వాగత ఆర్చిలు, అలంకరణలతో కాణిపాకానికి బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. ఆలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. సుమారు లక్ష మంది భక్తులు స్వామి దర్శనానికి రానున్నట్లు అధికారుల అంచనా. అందుకు తగ్గట్టు ప్రత్యేక క్యూలైన్లు, ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం లక్ష లడ్డూలు, ఐదు వేల వడలు సిద్ధం చేశారు. వీటి అమ్మకాలకు ఆలయం వెనుక వైపు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, మంగళవారం ఉదయం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలై.. 23న ముగుస్తాయి. 24న ప్రారంభమయ్యే ప్రత్యేక ఉత్సవాలు అక్టోబరు 4తో ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. చవితి రోజున, బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరిగే 21 రోజుల పాటు స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశామన్నారు. అన్నప్రసాద కేంద్రంలో ప్రతి రోజూ ఐదు వేల నుంచి ఏడు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తామన్నారు. బ్రహ్మోత్సవ కాలంలో సామాన్య భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు.. 10.30 నుంచి 11 గంటల మధ్య వీఐపీలు స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. భక్తుల భద్రతకు పోలీసులు, ఎస్టీఎఫ్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలలో ఎవరైనా అస్వస్థతకు గురైతే చికిత్స చేయడానికి వైద్యశిబిరం ఏర్పాటు చేసి, మందులు అందుబాటులో ఉంచామన్నారు. భక్తులకు బయో టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీని బట్టి స్వామి దర్శన సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పెంచతామన్నారు. వాహన సేవ ఆలస్యం కాకుండా కొంచెం ముందుగా బయలుదేరి రాత్రి 12 గంటలకన్నా ముందే ఆలయానికి తీసుకొచ్చేలా ఉభయదారులు సహకరించాలని కోరారు. ప్రత్యేక రోజులలో భక్తులు కాణిపాకం నుంచి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా అదనపు బస్సులను నడుపుతున్నామన్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే మురళీమోహన్ పర్యవేక్షించినట్లు తెలిపారు.
ఆలయంలో కర్రపూజ
ఽబ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభం వద్ద అర్చకులు, వేదపండితులు ఆదివారం కర్రపూజ నిర్వహించారు. వినాయక చవితికి ముందు రోజన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్ తదితరులు పాల్గొన్నారు.