Share News

ప్రతి నెలా.. ఈ కలయిక!

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:10 AM

ఒక్కో ఎమ్మెల్యే ఇంట్లో ఆత్మీయ సమావేశం తొలిసారి చిత్తూరు ఎమ్మెల్యే ఇంట్లో భేటీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చకు టీడీపీలో కొత్త సంప్రదాయం

ప్రతి నెలా.. ఈ కలయిక!
టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిని సన్మానిస్తున్న గురజాల, ఇతర ఎమ్మెల్యేలు

చిత్తూరు/చిత్తూరు సిటి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా నెలకోసారి ఓ ఎమ్మెల్యే ఇంట్లో సమావేశం కానున్నారు. జిల్లా సమస్యలు, రాజకీయాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ దిశగా టీడీపీ అధిష్ఠానం కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. అందులో తొలిసారిగా.. సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ ఇంట్లో మిగిలిన ఎమ్మెల్యేలంతా కలుసుకున్నారు. తొలుత పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి గురజాల నివాసానికి వచ్చి వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, థామస్‌, పులివర్తి నాని, గాలి భానుప్రకా్‌షతో పాటు పార్టీ అధ్యక్షుడు షణ్ముగంరెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ దామచర్ల సత్య, నాయకులు దొరబాబు, చంద్రప్రకాష్‌ తదితరులు హాజరయ్యారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు ఢిల్లీలో ఉండడం వల్ల హాజరుకాలేకపోయారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించి, కూటమి పార్టీల జెండాల్ని ఎగరేయాలి. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి. ప్రభుత్వం మీద, పార్టీ మీద విమర్శలు చేసేవారికి దీటుగా వెంటనే సమాధానం ఇవ్వాలి. ప్రస్తుతం మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీతో పాటు రెండేళ్ల పాలనలో విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సర్‌ ప్రక్రియను విజయవంతం చేయడం, క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు’ గురించి ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అందరూ కలిసి భోజనం చేశారు. థామస్‌ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మిగిలిన ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. వీరందరినీ గురజాల జగన్మోహన్‌ సత్కరించి జ్ఞాపికల్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ పటిష్ఠత, జిల్లాలో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలంతా కలిసి కట్టుగా నిర్ణయం తీసుకొనే అవకాశముంది.

Updated Date - Jun 30 , 2026 | 01:10 AM