ప్రతి ‘చినుకు’ను లెక్కిస్తారు
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:45 AM
తప్పుల తడకగా కాకుండా కచ్చిత ఆధారాలతో ప్రతి వర్షపు చినుకును లెక్కించేలా ఆటోమేటిక్ వెదర్‌స్టేషన్లను అధికారులు అప్‌డేట్ చేశారు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): తప్పుల తడకగా కాకుండా కచ్చిత ఆధారాలతో ప్రతి వర్షపు చినుకును లెక్కించేలా ఆటోమేటిక్ వెదర్‌స్టేషన్లను అధికారులు అప్‌డేట్ చేశారు. జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్) నిర్వహణపై కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఏర్పాటు చేసిన కొన్ని వెదర్ స్టేషన్లు ముళ్లపొదలు, కంపలతో ఆ ప్రాంతం నిండిపోయింది. దాంతో డేటా పనిచేయడం లేదు. ఈ కారణంగా అవి నిరుపయోగంగా మారిపోయింది. కచ్చితమైన వర్షపాతం లెక్కించడం సాధ్యం కాలేదు. ఇందుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో అక్కడ పారిశుధ్య చర్యలు చేపట్టి వెదర్ స్టేషన్లను వినియోగంలోకి అధికారులు తెచ్చారు. అవసరమైన చోట్ల మరమ్మతులు పూర్తిచేసింది. సాధారణ వర్షపాతం లెక్కించేందుకు 33 ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) మిషన్లను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి మండలానికి ఒకటికి మించి ఏర్పాటయ్యాయి. చిత్తూరులో 13, నగరిలో 8, పలమనేరులో 5 ఏఆర్జీలను ఇన్‌స్టాల్ చేశారు. 18 మండలాల్లో గతంలో ఉండిన ఏఆర్జీల స్థానే ఇప్పుడు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. దీంతో జిల్లాలోని 27 మండలాల్లో 54 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, 33 ఆటోమేటిక్ రెయిన్ గేజ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. గతంలో ఏడు ప్రాంతాల్లో గుర్తించిన లొకేషన్లలో కాకుండా వేరే లొకేషన్లలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మండలాలవారీగా నిండ్ర మండలం ఎట్టేరి, గుడుపల్లి మండలం కనమనపల్లెలో, ఐరాల మండలం మద్దిపట్లపల్లెలో, పూతలపట్టు మండలం కొత్తకోటలో, చిత్తూరు రూరల్‌లో టి. వేపనపల్లెలో, పులిచెర్ల మండలం కల్లూరులో, రొంపిచెర్ల మండలం బండకిందపల్లెల్లో వెదర్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. పంట నష్టం లెక్కల్లో ప్రభుత్వం వర్షపాతాన్ని కీలకంగా తీసుకుంటోంది. ఇది సరిగా నమోదు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి గతంలో ఎదురయ్యింది. జిల్లాను రెండుగా విభజించి వెదర్‌స్టేషన్ల పర్యవేక్షకులుగా ఇద్దరు సర్వీసు ఇంజినీర్లను నియమించారు. వారు తమ పరిధిలోని వెదర్ స్టేషన్ కేంద్రాల్లో సెన్సార్లు, ఇతర పరికరాలు అమర్చడంతో పాటు ప్రతిరోజు అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలిస్తూ వర్కింగ్ కండిషన్‌లో ఉంచుతారు.