రైతులకు సాయంత్ర సేవ
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:38 AM
కుప్పం మండలంలో రైతులకు వ్యవసాయ శాఖ సాయంత్ర సేవకు శ్రీకారం చుట్టింది. ఉన్నతాధికారుల అనుమతితో ఏవో ఫయాజ్ బాషా సాయంత్రం వేళ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతులతో సమావేశమై ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.
కుప్పం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కుప్పం మండలంలో రైతులకు వ్యవసాయ శాఖ సాయంత్ర సేవకు శ్రీకారం చుట్టింది. ఉన్నతాధికారుల అనుమతితో ఏవో ఫయాజ్ బాషా సాయంత్రం వేళ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతులతో సమావేశమై ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన సిబ్బందితో కలిసి కార్యాలయంలో, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్లి రైతులతో సమావేశమవుతున్నారు. 6.30నుంచి రాత్రి 10 గంటలదాకా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీఎ్‌ఫఆర్, ఈ-పంట, పీఎం కిసాన్ కేవైసీ, ఏపీఏఐఎంఎస్ వంటి పథకాలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రైతులు వేయాల్సిన పంటలు, పాటించాల్సిన పద్ధతులను తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరుస్తున్నారు. కుప్పం మండలంలోని దాసేగౌనూరు, కొట్టాలూరు తదితర గ్రామాల్లో రైతు సేవా సమావేశాలు జరిగాయి. ‘పగలంతా రైతులు వ్యవసాయ పనుల్లో ఉండడంవల్ల గ్రామంలో ఒక దగ్గర దొరికేది కష్టమవుతోంది. సాయంత్రం వేళ గ్రామంలోనే ఉంటారు. అందుకని ఆ సమయాన్ని రైతు సేవా సమావేశాలకు ఎంపిక చేసుకున్నాం. తమ గ్రామానికి ఎప్పుడు రావాల్లో రైతులు సమాచారం ఇస్తే అదే రోజు వెళ్లి వారితో సమావేశమవుతాం’ అని ఏవో ఫయాజ్ బాషా చెప్పారు.