మండుటెండలోనూ కృష్టమ్మ గలగల
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:52 AM
మోదుగులపల్లె చెరువుకు హంద్రీనీవా నీరు విడుదల
పుంగనూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వేసవిలోనూ చెరువులు నిండుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవా కాల్వల ద్వారా చేరిన నీటితో ఇప్పటికే మండలంలోని ఎనిమిది చెరువులు కళకళలాడుతున్నాయి. మరో రెండు చెరువులు నిండుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చడంతో పంటలు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. హెచ్‌ఎస్‌ఎస్‌ఎస్ ఏఈలు మోహన్, మహేశ్ నీటి విడుదలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మంగళవారం మోదుగులపల్లె పంచాయతీలోని పెద్దచెరువుకు హంద్రీనీవా నీటిని విడుదల చేశారు. ఈక్రమంలో రైతులు, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు చెరువుకు చేరుకుని జలహారతి ఇచ్చారు. పూజలు చేశారు. కూటమి నాయకులు మాట్లాడుతూ నియోజక టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి చొరవ, ఎంపీ దగ్గుమళ్ల్ల, కలెక్టర్, మంత్రిల కృషితో చెరువుకు నీరు చేరిందన్నారు. పెద్ద చెరువు కింద దాదాపు 700 ఎకరాల్లో పంటలకు ప్రాణం వచ్చిందన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ, జనసేన నాయకులు మాధవరెడ్డి, మసెన్న, గంగాధర్, జెల్లి మనోహర్, చైతన్యరాయల్, రాంబాబు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.