ఈవీ చార్జింగ్.. ఇకపై ఈజీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:57 AM
కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పోత్సహిస్తున్నాయి. ప్రజలు కూడా ఇంధన ధరలకు భయపడి ఎలక్ర్టిక్ వాహనాల వైపు అడుగులేస్తున్నారు. అందువల్లే జిల్లాలో ఈవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీంతో ఏపీఎస్పీడీసీఎల్ పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ముందుగా జాతీయ రహదారులకు పక్కనే ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
జాతీయ రహదారి పక్కనున్న
సబ్‌స్టేషన్ల వద్ద ఏర్పాటుకు కసరత్తు
11 చార్జింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
చిత్తూరు రూరల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పోత్సహిస్తున్నాయి. ప్రజలు కూడా ఇంధన ధరలకు భయపడి ఎలక్ర్టిక్ వాహనాల వైపు అడుగులేస్తున్నారు. అందువల్లే జిల్లాలో ఈవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.దీంతో ఏపీఎస్పీడీసీఎల్ పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ముందుగా జాతీయ రహదారులకు పక్కనే ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
వాహనాలు పెరిగినా..
జిల్లాలో ఈవీల వినియోగం పెరిగింది. ఐదేళ్ల కిందట కేవలం వెయ్యిలోపే ఉన్న వాహనాలు ప్రస్తుతం అన్ని రకాలు కలిపి పది వేలకు పెరిగాయి. ఈవీల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా.. బడ్జెట్ ధరల్లో వాహనాలు లేకపోవడం, చార్జింగ్‌కు ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలున్నాయి. ఇంటి దగ్గర చార్జింగ్ పెట్టుకుంటే అధిక విద్యుత్ బిల్లుతో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కూడా కొందరు భయపడుతున్నారు.
ఈ ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు
ప్రస్తుతం జిల్లాలో 32 ఎలక్ర్టిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరిన్ని స్టేషన్లు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ముందుగా జిల్లాలో జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న 27 సబ్‌స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలు కూడా అందాయని ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ముందుగా జిల్లాలో 11 చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన పంపినట్లు ఆయన తెలిపారు.
60 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఎస్పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు అనువుగా ఉన్న, ఎన్‌హెచ్ హైవే, ప్రభుత్వ స్థలాలను గుర్తించాం. అందులో మొదటి ప్రాధాన్యంగా 60 ప్రదేశాల్లో అంటే హైవేలకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. వీటిల్లో.. చిత్తూరులో 11, తిరుపతిలో 7, నెల్లూరులో 5, కడపలో 10, అనంతపురంలో 5, సత్యసాయిలో 12, అన్నమయ్యలో 1, కర్నూలులో 2, నంద్యాలలో 7 ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఏర్పాటు అయితే ఈవీలకు చార్జింగ్ కష్టాలు తీరుతాయి.