మ్యూజియం నిర్వహణ కోసం ఈ టెండర్లు
ABN , Publish Date - Jun 06 , 2026 | 01:01 AM
మ్యూజియం నిర్వహణ, సంరక్షణ సేవల కోసం మూడేళ్ల కాలపరిమితితో ఈ-ఓపెన్ టెండర్లు
తిరుమల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని ప్రపంచస్థాయి మ్యూజియంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మ్యూజియం నిర్వహణ, సంరక్షణ సేవల కోసం మూడేళ్ల కాలపరిమితితో ఈ-ఓపెన్ టెండర్లు ఆహ్వానించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఎదురుగా సుమారు 1.20 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మితమైన ఎస్వీ మ్యూజియం తిరుమల సంప్రదాయాలు, వైష్ణవ మఠం, హిందూ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఇందులో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు చారిత్రక ప్రాధాన్యం కలిగిన 9 వేలకుపైగా అరుదైన వస్తువులను భద్రపరిచారు. శిలావిగ్రహాలు, లోహ కళాఖండాలు, చిత్రాలు, ఆధునిక కళా వస్తువులు తదితర విభాగాలు ఇందులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత మరింతమంది భక్తులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫౌండేషన్ విరాళాలతో 2019లో ప్రారంభమైన ఆధునికీకరణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. నాలుగు అంతస్తుల్లో 14 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి మ్యూజియంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మ్యూజియం నిర్వహణ సేవలను మూడేళ్ల పాటు నిర్వహించేందుకు ప్రత్యేక ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవలను ఏర్పాటు చేయాలని గత మే నెలలో జరిగిన టీటీడీ బోర్డు తీర్మానించింది. అర్హత సాధించిన టెండర్లను తుది ఆమోదం కోసం మళ్లీ బోర్డు ముందుకు తీసుకురావాలని స్పష్టం చేసింది.