Share News

బలమైన అభ్యర్థులతో బరిలోకి

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:54 AM

కూటమి పార్టీల సమావేశంలో మంత్రి అనగాని

బలమైన అభ్యర్థులతో బరిలోకి
సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు

తిరుపతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): బలమైన అభ్యర్థులతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగాలని జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కూటమి పార్టీల సమన్వయ కమిటీలకు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం తిరుపతిలో జరిగిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు భిన్నంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపిద్దామని సూచించారు. కూటమి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికలకు వెళదామన్నారు.క్షేత్రస్థాయిలో కలసి పనిచేయడానికి వీలుగా కూటమి పార్టీల శ్రేణులను మానసికంగా సన్నద్ధం చేయాలని కోరారు.వార్డులు, డివిజన్ల వారీగా కూటమి పార్టీలకు వున్న బలాల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. అది కూడా సర్వేలు చేయించి వాస్తవ సమాచారం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక వుంటుందన్నారు. ఓటర్ల జాబితా విడుదలయ్యాక తదుపరి సమావేశం నిర్వహించాలని, అంతే కాకుండా నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా కూటమి పార్టీల నడుమ సమన్వయ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలతో పాటు కోర్టు కేసులతో పలుచోట్ల వార్డులు, డివిజన్లకు కూడా ఎన్నికలు పెండింగులో వున్న సంగతి ప్రస్తావిస్తూ కోర్టు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. సమావేశంలో టీడీపీ సమన్వయ కమిటీకి సంబంధించి జోనల్‌ ఇంఛార్జి దామచర్ల సత్య, పార్లమెంటు కమిటీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, పరిశీలకులు ఏపీ టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ, జనసేన కమిటీ సమన్వయకర్త దర్మరాజు, సభ్యులు కిరణ్‌ రాయల్‌, కీర్తన, విజయ్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్‌, కార్యదర్శి సన్నారెడ్డి దయాకర రెడ్డి పాల్గ్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 01:54 AM