భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:57 AM
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు
శ్రీకాళహస్తి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలయ్యాక ద్రౌపదీదేవిని వాహనంపై అగ్నిగుండం వద్దకు తీసుకొచ్చారు. గుండంలోని నుంచి నిప్పు కణికలను తీసుకుని అమ్మవారి ఒడిలో కట్టారు. తర్వాత గుండంలోకి ప్రధాన అర్చకులు మల్లెపూల చెండు విసిరారు. అనంతరం ఆలయం తరఫున కలశం, పోతురాజు, గెరికను తీసుకుని అగ్నిగుండం ప్రవేశించారు. వీరివెంట కంకణాలు ధరించిన 4,395 మంది వరకు అగ్నిగుండ ప్రవేశం చేశారు. పసుపు దుస్తులు ధరించి వేపమండలు చేతబట్టి పూల కిరీటాలు, కళ్లకు కాటుక పెట్టుకుని గోవిందనామ స్మరణతో అగ్నిగుండంలో నడుస్తూ ఎదురుగా వాహనంపై ఆశీనులైన ద్రౌపదీదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవానికి పట్టణంతోపాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. డీఎస్పీ నరసింహమూర్తి నేతృత్వంలో సీఐలు నాగరాజు, వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ముక్కంటి పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే వెంకటేశులు, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.