Share News

తిరుమలలో భక్తుల భద్రతే లక్ష్యం

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:53 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని, వాహన సేవలను ఆనందంగా తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పేర్కొన్నారు. తిరుమల నాలుగు మాడవీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం సీవీఎస్వో, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో భక్తుల భద్రతే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ

తిరుమల, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని, వాహన సేవలను ఆనందంగా తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పేర్కొన్నారు. తిరుమల నాలుగు మాడవీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం సీవీఎస్వో, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీఎస్వో మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి టీటీడీ విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు, బారికేడింగ్‌ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో భద్రతా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గరుడ సేవకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున తిరుమల, తిరుపతిలోని పార్కింగ్‌ ప్రాంతాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీవీఎస్వో తెలిపారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు సులభంగా మార్గనిర్దేశం చేసేందుకు తిరుమల, తిరుపతిలోని ముఖ్య కూడళ్లలో వివిధ భాషల్లో సైన్‌బోర్డులు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రణాళికాబద్ధంగా పటిష్ట బందోబస్తు: ఎస్పీ

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. టీటీడీ విజిలెన్స్‌, పోలీస్‌, ఫైర్‌, ఫారెస్టు, ఇంటెలిజెన్స్‌, ఆర్టీసీ, రైల్వే తదితర శాఖల సమన్వయంతో భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రామకృష్ణ, రవిమనోహరాచారి, టీటీడీ వీజీవో సురేంద్ర, ఫైర్‌, ఫారెస్టు, ఇంటెలిజెన్స్‌, ఆర్టీసీ, రైల్వే తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 01:53 AM