7 దశాబ్దాల వివాదానికి తెర
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:43 AM
సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న కంగుంది ఎస్టేట్ భూముల వివాదానికి ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది.
529 ఎకరాల భూమిపై రైతులకు హక్కులు
వంద కుటుంబాలకు చెందిన 416 మందికి లబ్ధి
కంగుంది ఎస్టేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం
కలెక్టర్ సుమిత్‌కుమార్ సిఫార్సుతో మంత్రివర్గం ఆమోదం
చిత్తూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న కంగుంది ఎస్టేట్ భూముల వివాదానికి ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. కంగుంది రిజర్వు ఫారెస్టులోని సుమారు 529.34 ఎకరాల భూమిపై 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పేద రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించాలని.. వారికి డీకేటీ పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్ని కోణాల్లో విచారించి ఇటీవల ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం దీన్ని ఆమోదించారు. ఈ నిర్ణయంతో వందలాది రైతు కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నిండనున్నాయి.
అసలేమిటీ వివాదం..
కంగుంది రిజర్వు ఫారెస్టు పరిధిలోని 529.34 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో అడవి పొరంబోకుగా నమోదై ఉంది. 1961లో ఈ భూములను రిజర్వు ఫారెస్టుగా నోటిఫై చేసినప్పటి నుంచి కుప్పం జమీందారు వారసులు వివిధ సెటిల్‌మెంట్ కోర్టులు, ట్రిబ్యునళ్లు, హైకోర్టుల్లో చట్టపరమైన పోరాటాలు చేశారు. ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారులు, సీసీఎల్‌ఏ వారి అప్పీళ్లను తిరస్కరించారు. ప్రస్తుతం హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగులో ఉన్నప్పటికీ కోర్టు ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఈ భూమి పూర్తిగా ప్రభుత్వ రెవెన్యూ భూమిగానే నిర్ధారించబడింది.
ఐదు దశాబ్దాలుగా సాగులోనే.. కానీ హక్కుల్లేవు
రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వేలో మాత్రం మూడు ప్రధాన ఆవాసాలైన చిలకలవంక (99 ఎకరాలు), రాములగుట్టచేను (200 ఎకరాలు), అంబాపురం (230.34 ఎకరాలు)లో సుమారు వంద కుటుంబాలకు చెందిన 416 మంది రైతులు ఈ భూములను నిరంతరాయంగా సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి అడవి లేదు. ఇక్కడ రైతులు సుమారు 15 బోర్లు వేసుకుని, విద్యుత్తు కనెక్షన్లు పొంది, అరటి, కొబ్బరి, నన్నారి వేళ్లు, మల్బరీ, వేరుశనగ, బంగాళాదుంప వంటి పంటలను పండిస్తున్నారు. కొందరు పక్కా ఇళ్లను, పశువుల పాకల్ని నిర్మించుకున్నారు. చేతిలో పట్టాలు లేకపోవడంతో వీరికి ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు, రుణాలు, అన్నదాతన సుఖీభవ వంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.
కలెక్టర్ చొరవ.. గ్రామసభలో తీర్మానం
రైతుల సమస్యల్ని స్వయంగా తెలుసుకునేందుకు కలెక్టర్ సుమిత్‌కుమార్ జూన్ 10వ తేదీన అంబాపురం గ్రామంలో ఉన్నతాధికారులతో కలిసి గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న అర్హులైన పేద రైతులకు డీకేటీ పట్టాలు మంజూరు చేయడానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ప్రభుత్వానికి ప్రతిపాదన
ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కలెక్టర్ సుమిత్‌కుమార్ రెండు ప్రధాన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి చేశారు. కంగుంది రిజర్వు ఫారెస్టు రెవెన్యూ గ్రామంలోని 529.34 ఎకరాల భూమిని ‘అడవి పొరంబోకు’ క్లాసిఫికేషన్ నుంచి ఏడబ్ల్యూడీ (అసెస్డ్ వేస్ట్ డ్రై)గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలనేది ఓ ప్రతిపాదన. బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, ప్రస్తుత ప్రభుత్వ అసైన్‌మెంట్ విధాన నిబంధనల ప్రకారం దశాబ్దాలుగా సాగులో ఉన్న అర్హులైన 416 మంది రైతులకు డీకేటీ పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలనేది మరో ప్రతిపాదన. మంగళవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనల్ని ఆమోదించారు. ‘కంగుంది రిజర్వు ఫారెస్టు రెవెన్యూ గ్రామంలోని 529.34 ఎకరాల భూమి అటవీ భూమి కాదనిత ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్ తేల్చారని, దీంతో ఆ భూమి వర్గీకరణను ‘అడవి పోరంబోకు’ నుంచి ‘అస్సెస్డ్ వేస్డ్ డ్రై’గా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.