Share News

వెంకటగిరిలో ఆగని ప్రభుత్వ భూముల కబ్జాలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:12 AM

ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపించాలని రెండు నెలలుగా వెంకటగిరి ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు

  వెంకటగిరిలో ఆగని  ప్రభుత్వ భూముల కబ్జాలు
తహసీల్దార్‌ కార్యాలయం (ఇన్‌సెట్‌లో) రికార్డు రూమ్‌కి వేసిన కొత్త తాళం

తిరుపతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపించాలని రెండు నెలలుగా వెంకటగిరి ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీగా ఏర్పడి అధికారులకు, నాయకులకు ఫిర్యాదులు చేస్తూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. మరోవైపు రాత్రికి రాత్రే భూ కబ్జాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. చివరకు తహసీల్దార్‌ కార్యాలయంలోని భూ రికార్డులు భద్రపరిచే రూమ్‌లో చోరీకి దిగారన్న విమర్శలొస్తున్నాయి. సర్వే నెంబర్లు 199-3, 199-4, 199-5, 200-2 రికార్డుల కోసం ఓ నాయకుడి అండదండలతో ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌, మీ-సేవ నిర్వాహకుడు, ఓ విలేకరి కలిసి రికార్డు రూమ్‌ను జల్లెడ పట్టారన్న ఆరోపణలున్నాయి. 1965లో విశ్వోదయ కళాశాల మైదానం వద్ద సమితి భవన కార్యాలయం కోసం అప్పటి వారసులు రిజిస్ర్టేషన్‌ చేయించారు. ఈ రికార్డుల కోసమే తహసీల్దార్‌ కార్యాలయంలో కబ్జాదారులు జల్లెడ పట్టారని సమాచారం. ఇందులో భాగంగానే రికార్డు రూమ్‌ తాళం కూడా పగులగొట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ భూమికి సంబంధించిన రికార్డుల కోసం స్థానిక రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలోనూ గురువారం రాత్రి 8గంటల వరకు కబ్జాదారులు వెతికినట్లు సమాచారం.

రికార్డుల తారుమారుకు సన్నాహాలు

జడ్పీ హైస్కూల్‌ మైదానం రికార్డులను తారుమారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అలాగే పెరియవరం సర్వే నెంబరు 161-3లో 5.29 ఎకరాల మైదానం ఉంది. దీనికి కూడా తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుకు వేసి కబ్జాకి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. క్రాస్‌ రోడ్డు పెరియవరం సర్వే నెంబరు 109-9లో 3ఎకరాలు ప్రభుత్వ భూమి కోసం ఇప్పటీకే 50 మంది వరకు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ర్టేషన్లు చేసుకుని ఉన్నారని తెలిపారు. బొప్పాపురం చెరువు సర్వే నెంబరు 165లో 75.6 ఎకరాలు, సర్వే నెంబరు 128లో 62.28 ఎకరాల చెరువు పొరంబోకు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూముల కబ్జాపై సీఐడీ విచారణ జరిపించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:12 AM