ఉపాధి.... రూపు మారింది
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:08 AM
రేపట్నుంచే అమల్లోకి వీబీ జీ రామ్ జీ ఇకపై 125 రోజుల పని దినాలు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి కూడా మారనున్న ఉద్యోగుల హోదాలు
సూళ్లూరుపేట, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): దాదాపు రెండు దశాబ్దాల ఉపాధి హామీ పథకం కొత్త రూపు సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ ..రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అంగ్ అజీవికా మిషన్) పేరుతో రేపటినుంచి అమలు కానున్న ఈ పథకంలో పలు చేర్పులు, మార్పులు చోటు చేసుకున్నాయి.తాజా పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ బుధవారం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో ప్రారంభించనున్నారు.
ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డుకు వంద రోజులు మాత్రమే పని దినాలు కల్పించేవారు. కొత్త పథకంలో 125 రోజుల పాటు పనిదినాలు కల్పించనున్నారు. వేతనాల చెల్లింపులో ఇప్పుడు జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు వారానికి ఒక రోజు వేతనాలు చెల్లిస్తారు. మస్టర్ వేసిన 15 రోజుల్లోగా శ్రామికుల ఖాతాలో వేతనాన్ని జమ చేయకపోతే పరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికీ 15 రోజుల్లోగా పని కల్పించాలి.పనులు చూపకపోతే నిరుద్యోగ భృతి దానంతట అదే కూలీల ఖాతాల్లోకి జమవుతుంది. ఈ పథకం అమలుకు గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. పనులను నాలుగు విభాగాలుగా విభజించారు. నీటి భద్రత, సంరక్షణ, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల, వాతావరణానికి, ప్రతికూల వాతావరణానికి అనుగుణంగా పనులు చేపట్టాలి. పనులకు సంబంధించి ఎప్పటిలాగే పంచాయతీలే ప్రణాళికలు తయారు చేసి జాబ్ కార్డులను మంజూరు చేస్తాయి. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వారు, వెట్టి కార్మికులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులు అందజేస్తారు.ఆరు నెలలకు ఒక సారి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. పనులు, వేతనాలు, మస్టర్ రోల్స్ చెల్లింపు వివరాలను ప్రజలకు బహిరంగంగా వెల్లడించడం తప్పనిసరి చేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రెడ్రసల్ వ్యవస్థ, అంబుడ్స్ పర్సన్ వ్యవస్థ అమల్లో ఉంటుంది. ఇక ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు ఏపీవోలు, ఇంజినీరింగ్, టెక్నికల్, పీల్డ్ అసిస్టెంట్లు ఇకపై వారందరూ వీబీజీ.. రామ్‌జీ పథకం కిందకు రానున్నారు. ఈ మేరకు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. హోదా కూడా మార్పు చేశారు. ఇకపై కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్స్ అసిస్టెంట్లు డిజిటల్ అడ్మినిస్ర్టేషన్ అసిస్టెంట్లుగా మారనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామీణ రోజ్‌గార్ సహాయక లేదా గ్రామ కాయకల్ప సహాయక్‌గా, టెక్నికల్ అసిస్టెంట్లను రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసోసియేట్‌గా పిలవనున్నారు. ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు మిషన్ ఇంజనీరింగ్ అసోసియేట్‌గా మారనున్నారు. అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ల హోదా అసిస్టెంట్ మిషన్ మేనేజర్‌గా మారనుంది.