Share News

ఇనామ్‌ భూములకు విముక్తి

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:37 AM

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా నిషేధిత జాబితా (22-ఏ)లో ఉన్న ఇనామ్‌, సర్వీసు ఇనామ్‌ భూములపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల ఎకరాల విలేజ్‌ సర్వీసు ఇనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోగా.. అందులో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 6239.2 ఎకరాలకు విముక్తి కలగనుంది.

ఇనామ్‌ భూములకు విముక్తి

క్రయ విక్రయాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం

రేపటి నుంచి రిజిస్ర్టేషన్లు

ఉమ్మడి జిల్లాలో 6239.2 ఎకరాలకు క్లియరెన్సు

త్వరలో ఫ్రీహోల్డ్‌ భూములకూ గ్రీన్‌ సిగ్నల్‌

చిత్తూరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా నిషేధిత జాబితా (22-ఏ)లో ఉన్న ఇనామ్‌, సర్వీసు ఇనామ్‌ భూములపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల ఎకరాల విలేజ్‌ సర్వీసు ఇనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోగా.. అందులో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 6239.2 ఎకరాలకు విముక్తి కలగనుంది. వీటిలో చిత్తూరు జిల్లాలో 358.91 ఎకరాలు, తిరుపతిలో 1950.34 ఎకరాలు, అన్నమయ్యలో 3929.95 ఎకరాలు చొప్పున ఉన్నాయి. వీటికి సోమవారం నుంచి రిజిస్ర్టేషన్లు జరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఈ నిర్ణయం ద్వారా చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఆ భూముల్ని గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక నుంచి అవి పట్టా భూములుగానే రికార్డుల్లో ఉంటాయి. ఆ భూములున్న రైతులకు భారీ ఊరట కలగనుంది.

ఇనామ్‌ భూముల నేపథ్యమిదీ

ఇనామ్‌ భూములంటే పట్టా కానివి, ప్రభుత్వ పరిధిలో ఉన్నవాటిని పరిరక్షించేందుకు నిషేధిత జాబితాలో చేర్చేందుకు ఇనామ్‌ భూముల సవరణ చట్టాన్ని 2013లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సర్వీసు ఇనామ్‌ భూములు అంటే అప్పటికే రైత్వారీ పట్టాలుగా మారినవి.. క్రయ విక్రయాలు జరిగినవాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చేశారు. ‘2013లో తీసుకొచ్చిన చట్టం రైత్వారీ పట్టాలు కలిగిన భూములకు వర్తించదని, వాటిని పట్టా భూములుగా గుర్తించాల’ని 2023లో అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పాటు 20 ఏళ్ల కిందట అసైన్డ్‌ పట్టా పొందిన భూములపై రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ 2023 డిసెంబరులో వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పెద్దఎత్తున అక్రమంగా భూముల్ని ఫ్రీహోల్డ్‌ చేసుకున్నారని కూటమి ప్రభుత్వం గుర్తించి, 2024 ఆగస్టులో ఫ్రీహోల్డ్‌ భూముల్ని మళ్లీ నిషేధిత జాబితాలో ఉంచేసింది. ఆ జాబితాలో సర్వీసు ఇనామ్‌ పట్టా భూములూ ఉన్నాయి. అవి రైత్వారీ పట్టాలని, ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు తేల్చారు. దీంతో ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, తిరిగి ఫ్రీహోల్డ్‌ చేయాలన్న ప్రతిపాదనకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

వారం, పది రోజుల్లో ‘ఫ్రీహోల్డ్‌’కూ..

సుమారు 21 నెలలుగా నిషేధిత జాబితాలో ఉన్న ఫ్రీహోల్డ్‌ భూములకు కూడా వారం పది రోజుల్లో క్లియరెన్సు రానుంది. ఈ నెల 8వ తేదీన జరిగిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2023 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న డీకేటీ పట్టాలపై ఆ రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున ఫ్రీహోల్డ్‌ చేసుకున్నారు. జిల్లాలో 1.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేయగా, అందులో 1.05 లక్షల ఎకరాలు అక్రమంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ భూముల్ని కూటమి అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టులో నిషేధిత జాబితాలో ఉంచేసింది. జిల్లాలో సక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసుకున్న 54 వేల ఎకరాలకు మాత్రమే వారం పది రోజుల్లో క్లియరెన్సు రానుంది.

Updated Date - Apr 19 , 2026 | 01:37 AM