Share News

పేదలపై విద్యుత్‌ భారం పడకూడదనే..!

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:28 AM

ఎస్సీ, ఎస్టీల పై విద్యుత్‌ భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్‌ పథకాన్ని తీసుకొచ్చాయని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు

పేదలపై విద్యుత్‌ భారం పడకూడదనే..!
సోలార్‌ ప్రాజెక్టును లబ్ధదారుల సులోచన చేత ప్రారంభింపచేస్తున్న మంత్రి గొట్టిపాటి తదితరులు

పూతలపట్టు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల పై విద్యుత్‌ భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్‌ పథకాన్ని తీసుకొచ్చాయని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. పూతలపట్టు మండలం ఆకనంబట్టు దళితవాడలో గురువారం ‘ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజన’ కింద ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచితంగా 2 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ యూనిట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. పూతలపట్టు నియోజకవర్గంలో సూర్యఘర్‌ పథకం కింద 4209 మంది ఎంపికకాగా, రూ.52.7 కోట్లతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఆర్డీఎస్‌ పథకం ద్వారా రూ.172.36 కోట్లు మంజూరుకాగా, ఇప్పటివరకు రూ.77.34 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నియోజకవర్గంలో కొత్తగా రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లను, 132/33 సబ్‌స్టేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకున్నాక విద్యుత్‌ బిల్లులు గణనీయంగా తగ్గుతాయన్నారు. విద్యుత్తు సరఫరా లేని ప్రాంతాల్లోనూ సోలార్‌ ద్వారా లైటింగ్‌, పంపులు వాడుకోవచ్చన్నారు. సోలార్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. పేదల ఇంటిపై సోలార్‌ను అమర్చితే అందుకు నెలకు రూ.200 నుంచి రూ.300 వరకు ప్రభుత్వం అద్దె కూడా చెల్లిస్తుందని ఎమ్మెల్యే మురళీమోహన్‌ చెప్పారు. పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరగా, మంత్రి హామీ ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఐదెకరాల భూమి ఇస్తే సబ్‌స్టేషన్‌ పెడతామన్నారు. ఆకనంబట్టు దళితవాడలో రూ.1.38 కోట్లతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ ఎంతో కృషిచేస్తున్నారని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. సోలార్‌ ప్రాజెక్టుకును లబ్ధిదారు సులోచన చేత ప్రారంభింపచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, సదరన్‌ డిస్కం అధికారులు శివశంకర్‌, ఉమాపతి, అమర్‌బాబు, మునిచంద్ర, టీడీపీ మండలాధ్యక్షుడు దొరబాబుచౌదరి, నాయకులు యువరాజు నాయుడు, గంగారపు గోపి, లోకేష్‌ రెడ్డి, హరీష్‌, దేవరాజు నాయుడు, రేవంత్‌, చంద్రమౌళి, హిమగిరి నాయుడు, చిరంజీవి, జిల్లా టీడీపీ అధ్యక్షులు షణ్ముగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారి వద్ద మంత్రికి స్వాగతం పలికి.. మంగళవాయిద్యాల నడుమ ఆకనంబట్టు దళితవాడకు తీసుకొచ్చారు.

Updated Date - Apr 24 , 2026 | 12:28 AM