విద్యుత్ మీటర్లు గిరగిరా...
ABN , Publish Date - Aug 23 , 2026 | 03:01 AM
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. జూన్ నుంచి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది. దీంతో జూలై,
ఎల్‌నినో ప్రభావంతో కొనసాగుతున్న ఎండలు
ఇళ్లలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
వేసవి కాలాన్ని తలపిస్తున్న బిల్లులు
జిల్లాలో 66.4 శాతం వర్షపాతం లోటు
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. జూన్ నుంచి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం కొంత తగ్గుతుంది. విద్యుత్ డిమాండ్ కూడా సాధారణంగా క్రమంగా దిగివస్తుంది. ఈసారి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎల్‌నినో కారణంగా వర్షాలు ముఖం చాటేయడంతో వేసవి తాపం కొనసాగుతుండగా.. దానికి తోడు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరంగా తిరుగుతుండటంతో విద్యుత్ వినియోగం అధిక స్థాయిలో కొనసాగుతోంది.
- చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి
ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాపై పెద్దగా కనిపించలేదు. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 273.9 మి.మీ. వర్షపాతం నమోదు కావల్సిఉంది. కానీ కేవలం 91.9 మి.మీ. మాత్రమే నమోదైంది. సాధారణం కంటే ఏకంగా 66.4 శాతం వర్షపాతం లోటు ఉంది. రాష్ట్రంలోనే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది. వర్షాలు కురవాల్సిన సమయంలోనూ ఎండలు కొనసాగుతుండటంతో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఏసీలు, కూలర్లపైౖ ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏసీల వినియోగం పెరగడంతో గృహ విద్యుత్ డిమాండ్‌పై అదనపు భారం పడుతోంది. పగటి వేళల్లో ఇళ్లలోనే కాకుండా దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లోనూ ఏసీల వినియోగం పెరిగింది. సాధారణంగా వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండ్ ఈసారి అంతగా తగ్గకపోవడం గమనార్హం. పగలు రాత్రి తేడా లేకుండా ఏసీలు,ఫ్యాన్లు వాడుతుండటంతో విద్యుత్ వినియోగం అధికమైంది.
ప్రజలపై పెరుగుతున్న భారం
వాతావరణం చల్లబడకపోవడంతో ప్రజలపై రెండు రకాల భారం పడుతోంది. ఒకవైపు ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువసేపు వినియోగించాల్సి వస్తుండగా.. మరోవైపు పెరిగిన వినియోగానికి అనుగుణంగా బిల్లులు కూడా పెరుగుతాయి. జిల్లాలో అన్ని కేటగిరిలు కలిపి 7,52,663 లక్షల సర్వీసులు ఉన్నాయి. అందులో 5,03,970 లక్షలు గృహ విద్యుత్ కనెక్షన్లే. దీంతో ఏసీ వినియోగించే కుటుంబాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితేనే విద్యుత్ డిమాండ్ సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు విద్యుత్ శాఖకు కూడా డిమాండ్‌ను తట్టుకోవడం సవాలుగా మారుతోంది.
కోతలు లేకుండా సరఫరా
ఈసారి ఎల్‌నినో కారణంగా ఎండల ప్రభావమెక్కువగా ఉంది. జిల్లాలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. అందుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. కోతలు లే కుండా జాగ్రతలు తీసుకుంటున్నాం. అనధికార కోతలు కూడా లేవు. నాణ్యమైన వి ద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి కూడా అంతరాయం లేకుండా సరఫరా చే స్తున్నాం.
- అమర్‌బాబు, ఎస్‌ఈ,విద్యుత్ శాఖ.
ఈ ఏడాది నెలల వారీగా విద్యుత్ కోటా, వినియోగం వివరాలు...
నెల కోటా వినియోగం
ఫిబ్రవరి 240.172 257.875
మార్చి 282.685 314.515
ఏప్రిల్ 305.297 331.186
మే 235.488 251.972
జూన్ 279.836 288.231
జూలై 296.193 308.040
ఆగస్టు(22 వరకు) 293.207 310.799
===============
400 పాఠశాలల్లో విద్యా సౌరబాలు
రూఫ్‌టాప్ సోలార్ ఫ్యానళ్ల ఏర్పాటు యోచన
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థలో ప్రభుత్వం వినూత్న సంస్కరణలు చేపడుతోంది. ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 9529 పాఠశాలను గుర్తించింది. ఈ స్కూళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయనుంది. మన జిల్లాలో 2,047 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉండగా, తొలి విడతలో 400 పాఠశాలలను ఇందుకోసం ఎంపిక చేయనుంది. గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఎదురవుతున్నాయి. సోలార్ ద్వారా ఈ సమస్యను అధిగమించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌లో స్కూలు వినియోగానికి పోనూ మిగిలిన విద్యుత్‌ను ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. విద్యుత్ నిరంతర సరఫరా ఫలితంగా పాఠశాలలో ఇంటర్నెట్ సమస్య తీరుతుంది. విద్యార్థులకు ఆన్‌లైన్ ఆధారంగా అధునాతన విషయాలను బోధించేందుకు ఆస్కారం కలుగుతుంది. పథకాలకు సంబంధించి వివరాలు నమోదు, ఇతర ప్రక్రియలకు ఇబ్బంది ఉండదు. త్వరలో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తారని సమాచారం.