Share News

ప్రాణాలు తీస్తున్న విద్యుత్తు కంచె

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:21 AM

బంగారుపాళ్యం మండలం బండ్లదొడ్డి గ్రామంలో అడవి పందుల కోసం కొంతమంది విద్యుత్‌ తీగలను అమర్చారు. అది గమనించని అదే గ్రామానికి చెందిన అప్పయ్య, కుట్టి, అడవిలో వేటాడేందుకు రాత్రి బయలుదేరారు. ఈ విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వీరితో పాటు అడవిపంది కూడా మృతి చెందింది. ఇంటి పెద్ద దిక్కులను కోల్పోయి ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది.

ప్రాణాలు తీస్తున్న విద్యుత్తు కంచె

  • ఏటా 10 మందికిపైగా మృతి

  • వన్యప్రాణులూ చనిపోతున్నాయి

  • చట్టవిరుద్ధమని ప్రచారం చేసినా పట్టించుకోని రైతులు

  • ప్రత్యామ్నాయంగా సోలార్‌ మంచిదంటున్న అధికారులు

చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి :

2025 నవంబరు 2

బంగారుపాళ్యం మండలం బండ్లదొడ్డి గ్రామంలో అడవి పందుల కోసం కొంతమంది విద్యుత్‌ తీగలను అమర్చారు. అది గమనించని అదే గ్రామానికి చెందిన అప్పయ్య, కుట్టి, అడవిలో వేటాడేందుకు రాత్రి బయలుదేరారు. ఈ విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వీరితో పాటు అడవిపంది కూడా మృతి చెందింది. ఇంటి పెద్ద దిక్కులను కోల్పోయి ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది.

2026 ఫిబ్రవరి 19

గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతీ మారేడిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పందుల బెడద ఎక్కువగా ఉండడంతో తన పొలం చుట్టూ విద్యుత్‌ తీగలు అమర్చాడు. ఆదే రోజు రాత్రి అదే గ్రామానికి చెందిన రామ్మూర్తి ఇంటి నుంచి కృష్ణాపురం వెళ్లొస్తానని ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ చోట ఆపి శ్రీనివాసులురెడ్డి పొలంలోకి వెళ్లారు. ఆ రైతు పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలను చీకట్లో చూసుకోక తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉందా కుటుంబం.

2026 మార్చి 8

ఎర్రావారిపాలెం మండలం చింతగుంట పంచాయతీ కొత్తతురకపల్లె వద్ద పంట రక్షణకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి ఆదివారం రాత్రి రెండు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటనలో ఆరేళ్ల మగ ఏనుగు.. దానికి వంద మీటర్ల దూరంలో 14 సంవత్సరాల ఆడ ఏనుగు మృత్యువాత పడ్డాయి. రైతులు సమీర్‌, అక్తర్‌పై కేసు నమోదైంది.

జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలను పందులు నాశనం చేస్తున్నాయి. రాత్రిళ్లు పంటలకు కాపలా ఉంటున్న రైతులపైనా దాడి చేస్తున్నాయి. దీంతో చుట్టూ వలలు, చీరలు చుట్టడం, టపాసులు కాల్చడం, మైకు చప్పుళ్లు వంటివి ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేదు. దీంతో కొంతమంది రైతులు పొలంచుట్టూ ఇనుప వైర్లతో (బైండింగ్‌ వైరు) కంచెగా ఏర్పాటు చేసి.. రాత్రి వేళ విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు. దీంతో జంతువులతోపాటు ప్రమాదవుశాత్తు మనుషులు కూడా మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా జిల్లా వ్యాప్తంగా 10 మందికిపైగా రైతులు, ఇతర వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని ఏర్పాటు చేయడం నేరమన్న అంశాన్ని చాలా మంది రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో కుటుంబంలోని పెద్ద దిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు వ్యధను ఆనుభవిస్తున్నాయి.

విద్యుత్‌ తీగలు లాగడం నేరం

పంటలను కాపాడుకోవాలని రైతులు వారి పొలం చుట్టూ కరెంటు కంచె ఏర్పాటు చేయడం నేరం. దీని కారణంగా వన్యప్రాణులతో పాటు మనుషులూ మృత్యువాత పడుతున్నారు. మరోవైపు రాత్రుల్లో విద్యుత్‌ అంతరాయంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు షార్ట్‌సర్క్యూట్‌ అవుతున్నాయి. ఇలా కరెంటు లాగడం నేరమని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. సింగల్‌ ఫేజ్‌కు 230.. ఎల్టీ లైన్‌ ద్వారా 440.. 11 కేవీ లైన్‌కు 11000 వోల్టుల విద్యుత్‌ సరఫరా ఉంటుంది. పొలాల్లో తమకున్న అవకాశాన్ని బట్టి ఆయా కరెంటు లైన్ల ద్వారా కంచెకు కనెక్షన్‌ ఇస్తున్నారు. భూమిలో తేమ శాతం ఉంటే మనుషులు విద్యుదాఘాతానికి గురైన 5 నిమిషాల్లోనే చనిపోతారు. అదే 11 కేవీ లైన్‌ ద్వారా కనెక్షన్‌ ఇస్తే నిమిషంలోపే మృతి చెందుతారు. రైతులు నేరుగా 11 కేవీ లైన్ల ద్వారా విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేస్తుడడంతో ఆ పవర్‌కి పెద్ద ఏనుగులూ నిమిషాల్లో మృత్యువాత పడుతున్నాయి.

- మునిచంద్ర, డిస్కం ఈఈ, చిత్తూరు ఆపరేషన్‌ డివిజన్‌

ప్రాణహాని లేకుండా...

సోలార్‌ కంచెతో పంటకు రక్షణతోపాటు వన్యప్రాణులకు ఎలాంటి హానీ ఉండదు. ఇది ఎలా పని చేస్తుందంటే.. పొలంలో ఒక స్తంభానికి 12 లేదా 15 వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యమున్న సోలార్‌ ప్యానెల్‌, బ్యాటరీ, ఎర్తింగ్‌ చేసుకుంటారు. పొలం చుట్టూ మూడు వరసలుగా తీగలు చుట్టాలి. ఇన్సులేటర్‌ ఉపయోగిస్తే భూమికి విద్యుత్‌ సరఫరా కాదు. సోలార్‌ పలక ద్వారా వచ్చే విద్యుత్‌ బ్యాటరీలో నిల్వ ఉండటంతో రాత్రివేళల్లోనూ పనిచేస్తుంది. జంతువులు తీగకు తగిలినప్పుడు షాక్‌ కొడుతుంది. ఆ షాక్‌కు జంతువులు కానీ, మనుషులు కానీ చనిపోయేంత ఉండదు. ఇక, పొలం దగ్గర డేంజర్‌ అనే బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. సోలార్‌ ప్యానెల్‌, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రూ.33 వేల నుంచి భూమి విస్తరణ ఎంతుంటే.. అంత డబ్బులు ఖర్చవుతాయని సోలార్‌ ప్యానెల్‌ కంపెనీ నిర్వాహకులు తెలిపారు.

ఫ పంట పొలాలపై వన్యప్రాణులు పడి ధ్వంసం చేయడంతో నష్టపోతున్నాం. వాటి నుంచి పంటల రక్షణకు కరెంటు లాగుతున్నాం.

- రైతుల మాట

ఫ పొలం చుట్టూ కరెంటు లాగడానికి ఎలాంటి అనుమతి లేదు. ఇది చట్టవిరుద్ధం. ఇలా చేస్తే చర్యలు తీసుకుంటాం.

- విద్యుత్తు శాఖ అధికారుల హెచ్చరిక

ఫ కరెంటు తీగలు పెట్టిన విషయం తెలియని వారెందరో? రాత్రిళ్లు చీకట్లో అటుగా వెళ్లి.. విద్యుదాఘాతంతో చనిపోతే ఎవరు బాధ్యులు? అలాంటి కుటుంబీకుల మాటేమిటి?

- మృతుల కుటుంబీకుల ప్రశ్నలు

ఫ వన్యప్రాణులను చంపడం నేరం. పంటలకని పెట్టిన కరెంటు వైర్లతో ఏనుగులు వంటివి చనిపోతుంటే ఎలా? వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.

- జంతుప్రేమికుల విజ్ఞప్తి

Updated Date - Mar 11 , 2026 | 02:21 AM