అమల్లోకి ఎన్నికల ‘కోడ్’
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:23 AM
నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవు చిత్తూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబరు 18004254901 స్థానిక ఎన్నికల విధులకు పదివేల మంది సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నియమావళి అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్లోని మీటింగు హాలులో బుధవారం రాత్రి ఆయన జిల్లా ఎన్నికల అధికారి హోదాలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ తుషార్ డూడీతో కలిసి సుమిత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల విఽధుల్లోని అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్.. నెంబరు 18004254901 ను ఏర్పాటు చేశాం. ఎన్నికల నిర్వహణలో సుమారు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 13.06 లక్షల మంది ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీచేశాం. రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాం. 2026 జనవరి ఒకటి నాటి ఓటరు జాబితాను తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తున్నాం. నామినేషన్ల స్వీకరణ చివరి నాటి వరకు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ వివరించారు.
బైండోవర్ కేసులు పెట్టాం
స్థానిక ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న 779 మందిని గుర్తించి.. కొంత మందిపై బైండోవర్ కేసులు పెట్టామని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ‘పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, అనధికారికంగా ఆయుధాల వినియోగం వంటి వాటిని అరికట్టేందుకు కార్డన్‌సెర్చ్ కార్యక్రమాలను నిర్వహిస్తాం. సున్నిత, అతిసున్నిత ప్రాంతాలను గుర్తించాం. పొరుగు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేస్తాం. నగదు, మద్యం రవాణాల, ఇతర ప్రాంతాల నుంచి ప్రచారాల కోసం వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. సీసీ టీవీలు, డ్రోన్లు, స్థిర, తాత్కాలిక చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తాం. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, ఓటర్లను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. సోషల్ మీడియా కలాపాలపై 24 గంటల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వెంకటేశ్ పాల్గొన్నారు.