జనసేనలో ఎన్నికల సందడి!
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:34 AM
మున్సిపల్ ఎన్నికలపై జనసేన దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. తిరుపతిలో శుక్రవారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
సమన్వయ కమిటీ సమావేశంలో ఆశావహుల హడావుడి
తిరుపతి సిటీ, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి):మున్సిపల్ ఎన్నికలపై జనసేన దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. తిరుపతిలో శుక్రవారం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల సమన్వయ కర్త, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సమన్యయ కమిటీ సభ్యులు కిరణ్ రాయల్, కీర్తన, క్రికెట్ విజయ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో ఉదయం గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట , సాయంత్రం తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు జరిగాయి. ఆశావహులు పెద్ద సంఖ్యలో హాజరై తమకు అనుకూలంగా ఉన్న వార్డులు, స్థానికంగా పార్టీ బలాబలాలను వివరించారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు మాట్లాడుతూ కూటమి పొత్తులో భాగంగా కొన్ని చోట్ల త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు.వంద శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా టికెట్ ఎవరికి దక్కినా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.జనసేనకు తొలినుంచి ఆర్థిక బలం లేనివాళ్లు కూడా అండగా ఉన్నారని అలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని పలువురు ఆశావహులు కోరారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో 10 నుంచి 12వార్డుల్లో పార్టీ బలంగా ఉందని పలువురు ఆశావహులు చెప్పినట్లు సమాచారం. గూడూరు చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధమని ఆ ప్రాంత నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా పోటీకి సంసిద్ధుడై ఉన్నానని తోట కృష్ణయ్య,శ్రీకాళహస్తి నుంచి ఛైర్మన్‌గా అవకాశమిస్తే తాను పోటీచేస్తానని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చక్రధర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గ సమావేశంలో డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, ఆశావహుల బలాబలాలు, స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తిరుపతి మేయర్ పదవిని జనసేనకు కేటాయించేలా ఒత్తిడి తెస్తున్నట్టు సమన్వయకర్తలు తెలిపారు.అనంతవీధి (36వ డివిజన్)నుంచి కార్పొరేటర్‌గా పోటీచేసేందుకు దాదాపు 10మంది అభ్యర్థులు క్యూకట్టినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజా రెడ్డి, బాబ్జీ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.