మనవరాలిని కాపాడి..!
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:55 AM
పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్లిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
గంగవరం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్లిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. దారి మధ్యలోని నదిలో కొట్టుకుపోతున్న మనవరాలిని కాపాడి.. అవ్వా తాత మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన రైస్‌మిల్లు యజమాని శ్రీనివాసులుశెట్టి, ధనమ్మ దంపతులకు కుమార్తె కావ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలమనేరుకు చెందిన కిరణ్‌తో ఎనిమిదేళ్ల క్రితం కావ్యకు వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరిద్దరి కుటుంబాలు కలిసి పూరీ జగన్నాథ ఆలయానికి బయలుదేరారు. బెంగళూరు నుంచి ఈనెల 10వ తేది రైలులో జైపూర్‌కు వెళ్లారు. అక్కడున్న మరికొంతమంది స్నేహితులతో కలిసి టూరిస్టు బస్సులో 11వ తేదీ పూరీకి బయలు దేరారు. 12వ తేదీ ఉదయం ఒడిశాలోని బైతరణి నది ప్రవాహ ఉదృతిని వీక్షించాలని, బస్సులోని వారందరూ కిందకు దిగారు. నదీఒడ్డును చిన్నపాటి నీటిలో ఆటలాడుతూ కావ్య కుమార్తె ఆరేళ్ల యశస్విని లోతైన ప్రాంతానికి చేరుకుని ఏడుస్తూ కనిపించింది. మనవరాలి ఏడుపును గుర్తించిన ధనమ్మ కేకలు వేసి నదిలోకి దూకేసింది. ఈత రాకపోయినా మనవరాలిని కాపాడాలనే తపనతో వెళ్లారామె. మనవరాలిని రెండు చేతుల్లో ఎత్తుకొని లోతట్టు ప్రాంతం నుంచి మిట్టప్రాంతానికి విసిరేశారు. ఆ క్రమంలో బ్యాలెన్స్ చిక్కక ఆమె ప్రవాహంలో వెనక్కి పడి మునిగిపోయారు. అయ్యో నా భార్య మునిగిపోయిందంటూ శ్రీనివాసులు శెట్టి నీళ్లలో దూకేశారు. ధనమ్మ ప్రవాహంలో కొట్టుకొని పోతూనే చేతులు మాత్రం పైకి కనిపిస్తోంది. ఎలాగోలాగా ఆమె చేతులు పట్టుకొని అలసిపోయి అక్కడే మునిగిపోయి ఇద్దరూ కొట్టుకుపోయారు. ఈ సంఘటనతో ఇరువురి కుటుంబసభ్యులు కాపాడండి అంటూ విలపించారు పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రంగా గాలించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగలిగారు. అక్కడే ప్రభుత్వాస్పత్రికి తరలించగా, సమయం మించిపోయిందని పోస్టుమార్టం కు వీలుకుదరలేదు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం విమానంలో బెంగళూరుకు.. అక్కడ్నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను మేలుమాయి క్రాస్‌కు తీసుకురానున్నారు. ఈ విషయం తెలిసి మేలుమాయి క్రాస్, పలమనేరు నుంచి వారి బంధువులు విషాదంలో మునిగిపోయారు. తమ వారికి ఫోను చేయగా.. ‘ఏం చెప్పమంటారు. మా కళ్లముందే అన్నీ జరిగిపోయాయి. మేము ఏమీ చెప్పే స్థితిలో లేము. దయచేసి అర్ధం చేసుకోండి’ అంటూ బోరున విలపిస్తూ ఫోన్లు పెట్టేశారు.