Share News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:13 AM

‘తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. వారికి ఎక్కడా అసౌకర్యం కల్గకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’ అని అధికారులను టీటీడీ జేఈవో శరత్‌ ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ జేఈవో శరత్‌

టీటీడీ జేఈవో శరత్‌

తిరుపతి(టీటీడీ), జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. వారికి ఎక్కడా అసౌకర్యం కల్గకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’ అని అధికారులను టీటీడీ జేఈవో శరత్‌ ఆదేశించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ‘భక్తుల వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో తగిన పార్కింగ్‌ స్థలాలు సిద్ధం చేయాలి. వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్‌ పాయింట్లు పెట్టి.. ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలి. ఈ ప్రాంతాల్లో మొబైల్‌ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి.. పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలి. తిరుపతితోపాటు పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు అధిక సంఖ్యలో సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ముఖ్య ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌లతో సూచిక బోర్డులు ఉండాలి. స్థానిక ఆలయాలు, ప్రధాన భవనాలు, ప్రధాన రహదారులను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలి’ అని ఇంజనీరింగ్‌ అధికారులను జేఈవో ఆదేశించారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండు, అలిపిరి బస్టాండు, అలిపిరి నడకమార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో అదనపు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య ప్రాజెక్టులో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులను నియమించాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రవికి ఆదేశాలిచ్చారు. ఎస్‌ఈ-1 మనోహరం, ఎస్‌ఈ(ఎలక్ర్టికల్‌) వెంకటేశ్వర్లు, డీఈలు రవిశంకర్‌రెడ్డి, సరస్వతి, విజిలెన్స్‌ అధికారి గిరిధర్‌, అదనపు ఆరోగ్య అధికారి సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 02:13 AM