Share News

ఎల్‌నినో.. ఎన్నాళ్లనో?

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:37 AM

ఇప్పటికీ ఎండలు తీవ్రం.. జాడలేని వర్షం తగ్గుముఖం పట్టిన వరి, వేరుశనగ సాగు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న అధికారులు

ఎల్‌నినో.. ఎన్నాళ్లనో?
వర్షాభావంతో బీడుగానే భూములు

వర్షపాతం ఇలా..

గతేడాది: జూన్‌ నెలలో 80.9 మి.మీ సాధారణ వర్షపాతానికిగాను 38.7 మి.మీ వర్షం పడింది. జూలైలో 103.5 మిమీకి గాను 96.4 మిమీ వర్షపాతం నమోదైంది.

ఈ సంవత్సరం: జూన్‌లో 79 మి.మీ సాధారణ వర్షపాతానికిగాను 67 మి.మీ నమోదైంది. జూలైలో 103 మి.మీ గాను.. ఈ 13 రోజుల్లో కేవలం 6.4 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది.

పంటల సాగు లెక్క

గతేడాది: జూలై నాటికి 1,57,867 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 19,182 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వీటిలో ప్రధానంగా వరి 4750, వేరుశనగ 7130 ఎకరాలు, మిగిలిన 18 రకాలైన చెరకు, మొక్కజొన్న, రాగి, కందులు, ఉలవలు, తదితర పంటలు 7302 ఎకరాల్లో సాగయ్యాయి.

ఈ సంవత్సరం: ఇప్పటి వరకు వేరుశనగ 54,757 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 2767.. వరి 22,670 ఎకరాలకు గాను 1495.. మిగిలిన 11,203 ఎకరాల్లో 18 రకాల పంటలు సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. చాలావరకు రైతులు బోర్లు కింద కొంతవరకు వరి సాగు చేసుకొంటున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని బట్టి మరో రెండు నెలల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందా? తగ్గుతుందా అనేది తేలనుంది.

ఈ వర్షపాతం.. పంటల లెక్క చూస్తే చాలు, జిల్లాపై ఎల్‌నినో ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని భయపెట్టే ఈ ఎల్‌నినో.. ఎన్నాళ్లు ఉంటుందనేది రైతన్నలో గుబులురేపుతోంది. ఇప్పటికీ ఎండల తీవ్రత కలవరపరుస్తోంది. పంటల సాగుపై అయోమయం కలిగిస్తోంది. దీన్నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ పంటలే మేలన్నది అధికారుల సూచన.

ఎల్‌నినో.. దీనివల్ల పసిఫిక్‌ మహా సముద్రంలో నీళ్లు అసాధారణంగా వేడెక్కడంతో రుతుపవనాలు బలహీనపడటానికి కారణమైంది. ఖరీఫ్‌ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకే సమయంలో వర్షాలు పడటం లేదు. కొన్నిచోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఇండియన్‌ మెట్రలాజికల్‌ డిపార్టుమెంట్‌-ఐఎండీ) నివేదికల ప్రకారమైతే చిత్తూరు జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కానీ, ఎల్‌నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక, ఖరీఫ్‌ సీజన్‌లో 1,06,500 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగు కావాలి. ఇప్పటికి 15,465 ఎకరాల్లో సాగయ్యాయి. ఖరీ్‌ఫలో ఆగస్టు, సెప్టెంబరు నెలలు చాలా కీలకం. నైరుతి ప్రభావంతో ఈ నెలల్లోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. ఈ రెండు నెలల్లోనూ ఈ పరిస్థితులే ఉంటే 40 శాతం వరకు పంటల సాగు తగ్గే అవకాశముంది.

ఆ మూడు నెలల్లోనే కొంత ప్రభావం

జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జిల్లాపై ఎల్‌నినో ప్రభావం కొంత ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా తూర్పు మండలాల్లో అక్కడక్కడా అసాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నా, ఎక్కడని కచ్చితంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు. మరో వైపు ఒకట్రెండు రోజులు వర్షాలు కురిసి.. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమూ ఉందంటున్నారు.

ఆ పంటలు వద్దు

నీళ్లు ఎక్కువ అవసరం కలిగిన వరి, వేరుశనగ, అరటి, బొప్పాయ వంటి పంటలు సాగు చేయడం సరికాదు. వీటిని సాగు చేయొద్దంటూ వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.

ఈ పంటలు మేలు

వర్షాభావాన్ని తట్టుకుని నిలబడే సోయాబీన్‌, ఉలవలు, పశగ్రాసం సాగుచేస్తే రైతులకు ప్రయోజనమని అదికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 6,250 ఎకరాల్లో సోయాబీన్‌ సాగు చేయగా, వేరుశనగకు ఉలవలు ప్రత్యామ్నాయ పంటగా అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా ఉలవల సాగు ఎంత ఉంటుందనే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, జూలై నెలాఖరకు ఉలవల విత్తనాలు రాగానే రైతులకు అందిస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15 వరకు ఉలవలు వేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక, 5 వేల ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేశారు.

(చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 15 , 2026 | 01:37 AM