Share News

అటు బెంగళూరు.. ఇటు చెన్నై

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:08 AM

దేశంలోని పలు నగరాలను కలుపుతూ ఏకంగా 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు

అటు బెంగళూరు.. ఇటు చెన్నై

చిత్తూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నుంచి అటు చెన్నైకు, ఇటు బెంగుళూరుకు.. ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం అరగంటలోనే వెళ్లిపోవచ్చు. జిల్లా మీదుగా ప్రయాణించే చెన్నై- బెంగుళూరు హైస్పీడ్‌ కారిడార్‌లో ఇది సాధ్యమవుతుంది.

దేశంలోని పలు నగరాలను కలుపుతూ ఏకంగా 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందులో హైదరాబాద్‌- చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు, చెన్నై- బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రంలో ప్రయాణిస్తాయి. చెన్నై- బెంగళూరు కారిడార్‌ చిత్తూరు, పలమనేరు మీదుగా మన జిల్లాలో ప్రయాణిస్తుంది. మొత్తంగా ఇది 306 కిలోమీటర్లు ప్రయాణించగా, చిత్తూరు జిల్లాలో 90 కిలోమీటర్లు వెళ్లనుంది. ఈ చెన్నై- బెంగళూరు కారిడార్‌ నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? ఎంత భూమి అవసరం అనే వివరాలతో డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారవుతోంది. హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌ డీపీఆర్‌ సిద్ధమైపోయింది. ఇది కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల మీదుగా 605 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రూ.1.51 లక్షల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

తిరుపతి మీదుగా సాధ్యమా?

చెన్నై- బెంగళూరు కారిడార్‌ చిత్తూరు మీదుగా మాత్రమే ప్రయాణించేలా కేంద్రం డిజైన్‌ చేసింది. తిరుపతి మీదుగా కూడా వెళ్లేలా చూడాలని సీఎం చంద్రబాబు రైల్వేశాఖను కోరారు. ఈ ప్రతిపాదన పరిశీలన దశలో ఉంది. వాస్తవానికి హైదరాబాద్‌- చెన్నై కారిడార్‌ తిరుపతి మీదుగా వెళుతోంది. బెంగుళూరు- చెన్నై కూడా తిరుపతి మీదుగా తీసుకెళ్తారా.. చిత్తూరు వరకే పరిమితం చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

320 కిలోమీటర్ల స్పీడు..

హైస్పీడ్‌ రైలు కారిడార్‌ పూర్తయితే, వాటిపై బుల్లెట్‌ రైళ్లు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. చిత్తూరు నుంచి ఇటు చెన్నైకు గానీ, అటు బెంగుళూరుకు గానీ అరగంటలో చేరుకునేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన కారిడార్లలో.. అమరావతి నుంచి హైదరాబాద్‌కు గంటలోపు, అమరావతి నుంచి తిరుపతి, చెన్నైలకు రెండు గంటల్లోపు చేరుకోవచ్చు.

Updated Date - Feb 03 , 2026 | 12:09 AM