అటు నేతగా.....ఇటు మంత్రిగా
ABN , Publish Date - May 07 , 2026 | 01:45 AM
మంత్రి లోకేశ్ శ్రీసిటీ పర్యటన ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఏసీ తయారీ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ రూ. 1000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక తయారీ యూనిట్‌కు మంత్రి లోకేశ్ బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ఉత్సాహభరితంగా సాగిన లోకేశ్ పర్యటన
సత్యవేడు, మే 6 (ఆంద్రజ్యోతి): మంత్రి లోకేశ్ శ్రీసిటీ పర్యటన ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఏసీ తయారీ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ రూ. 1000 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక తయారీ యూనిట్‌కు మంత్రి లోకేశ్ బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. అంతకుముందు శ్రీసిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు క్యారియర్ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పరిశ్రమ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్‌తో కలిసి మంత్రి లోకేశ్ ఏసీ తయారీ పరిశ్రమకు భూమిపూజ చేశారు. క్యారియర్ ప్రతినిధులతో కలిసి గ్రూఫ్ ఫొటో దిగారు. క్యారియర్ సంస్థ ప్రతినిధులు మైకేల్ ఎల్ గియర్టెస్, సుందరేశన్ నారాయణన్,నడియా విల్లెనేవ్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జేసీ గోవిందరావు,ఎమ్మెల్యేలు భానుప్రకాష్, విజయశ్రీ, ఎమ్మెల్సీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్తులతో లోకేశ్ సెల్ఫీ
మంత్రి లోకేశ్ శ్రీసిటీ పర్యటనలో భాగంగా తమ గ్రామానికి వస్తున్నారన్న సమాచారంతో ఆరూరు గ్రామస్తులు, రైతులు పలువురు క్యారియర్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు.భద్రతా కారణాలతో పోలీసులు వారిని రోడ్డుకు అవతలి వైపే నియంత్రించారు. అదే సమయంలో పరిశ్రమ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళుతున్న లోకేశ్ వారిని గమనించి అభివాదం చేశారు. దీంతో వారంతా ఒక్కసారిగా పోలీసులను చేధించుకుని లోకేశ్ వైపు పరుగులు పెట్టారు.లోకేశ్‌కూడా సెక్యూరిటీ వారిస్తున్నా గ్రామస్తుల వైపు తనే కదిలి వెళ్ళారు. మహిళలు, రైతులు, వృద్ధులు పరుగెడుతూ వచ్చి లోకేశ్‌ను చుట్టుముట్టారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు. లోకేశ్ కూడా అందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరిగెత్తుకొస్తూ పడిపోయిన మహిళకు దెబ్బలేమైనా తగిలాయా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారితో సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు లోకేశ్‌కు వినతులు అందించారు. ఏపీఐఐసీ తమ గ్రామంలో చేపడుతున్న భూసేకరణకు సంబంధించి పరిహారం విషయంలో న్యాయం చేయాలని వేడుకున్నారు.లోకేశ్ పర్యటనలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. లోకేశ్ పర్యటిస్తున్న సమయంలోనే ఎమ్మెల్యే కేవీబీపురం మండలంలో జాబ్‌మేళా, వంతెన భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.