Share News

చదువుకుంటేనే సమున్నత గౌరవం

ABN , Publish Date - Apr 15 , 2026 | 01:51 AM

దళిత, గిరిజనులు చదువుకుంటేనే సమాజంలో గౌరవంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశం ఉంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు.

చదువుకుంటేనే సమున్నత గౌరవం
దర్గా సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తదితరులు

సంక్షేమ పథకాలను దళితులు సద్వినియోగం చేసుకోవాలి

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల పిలుపు

చిత్తూరు అర్బన్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): దళిత, గిరిజనులు చదువుకుంటేనే సమాజంలో గౌరవంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశం ఉంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం చిత్తూరులోని అంబేడ్కర్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం వల్లే నేటికీ ప్రభుత్వ పాలన, న్యాయ వ్యవస్థ, చట్టసభల్లో అందరికీ సమాన అవకాశాలు అమలవుతున్నట్లు చెప్పారు. తరతరాలుగా విద్యకు దూరమైన దళితుల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు కల్పించి అంబేడ్కర్‌ చేసిన కృషి అనన్యసామాన్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. కష్టపడి చదువుకోవడం ద్వారా ప్రపంచం గర్వించే స్థాయికి అంబేడ్కర్‌ ఎదిగారని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గుర్తుచేశారు. 75 ఏళ్ల కిందటే భవిష్యత్తును ఆలోచించి రాజ్యాంగాన్ని రచించడం ఆయన దార్శనికతకు నిదర్శనమన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్‌ అన్నారు. నేటి యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అంబేడ్కర్‌ జీవిత చరిత్ర, ఇతర ఘట్టాలకు సంబంధించి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2025-26 సంవత్సరానికి గాను ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.47 లక్షల విలువ చేసే మెగా చెక్కును అందించారు. ఈ సమావేశంలో చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్లు యుగంధర్‌, బాబు, డీవీఎంసీ సభ్యులు రాజ్‌కుమార్‌, మునస్వామి, దళిత సంఘాల నేతలు విజయభాస్కర్‌, దాము, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు దర్గా సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ్నుంచి ర్యాలీగా ఎంఎ్‌సఆర్‌ సర్కిల్‌, గాంధీ విగ్రహ కూడలి మీదుగా అంబేడ్కర్‌ భవన్‌కు చేరుకుని.. అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

పిలిచి అవమానించారు: ఎమ్మార్పీఎస్‌

అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమానికి తమను పిలిచి అవమానించారంటూ పలువురు ఎంఆర్‌పీఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైకి దళిత నేతలను మాత్రమే పిలిచి మాట్లాడించారని, ఆ సంఘ నేతలను సన్మానించారన్నారు. ఎంఆర్‌పీఎస్‌ నేతలైన తమను పట్టించుకోలేదంటూ వెళ్లిపోయారు.

Updated Date - Apr 15 , 2026 | 01:51 AM