Share News

చదువుకుంటూనే సంపాదన

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:27 AM

విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలను సాధిస్తూ సంపాదించాలన్నదే శ్రీసిటీ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ (ఎస్‌ఐయూ) లక్ష్యం.

చదువుకుంటూనే సంపాదన
జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్‌ఐయూని ప్రారంభిస్తున్న మంత్రి లోకేశ్‌,

సత్యవేడు, జూలై 2(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలను సాధిస్తూ సంపాదించాలన్నదే శ్రీసిటీ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ (ఎస్‌ఐయూ) లక్ష్యం. ఈ దిశగా టెక్నాలజిస్టులు, పారిశ్రామిక నిపుణులు, దాతలు కలసి ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. నాన్‌ ప్రాఫిటబుల్‌ విద్యాసంస్థగా పనిచేసే ఈ వర్క్‌- స్టడీ మోడల్‌ వర్సిటీని గురువారం మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐయూ గ్లోబల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌, గవర్నింగ్‌ బోర్డు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. ఈ వర్క్‌- స్టడీ మోడల్‌ ద్వారా ప్రతి విద్యార్థి విద్యతో పాటు వాస్తవ ఉద్యోగ అనుభవం పొంది మార్కెట్‌కు సిద్ధమవుతారు. ఇందులో భాగంగా విద్యార్థులు తమ స్టడీలో మూడోవంతు సమయం మాత్రమే క్యాంప్‌సలో చదువుతారు. మిగిలిన సమయంలో పరిశ్రమల వద్ద ఇంటర్న్‌షి్‌పగా పని చేస్తారు. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు నెలకు కనీసం రూ.10 వేల స్టైఫండ్‌ అందుతుంది. పనిలో నిపుణత పెరిగే కొద్దీ ఈ మొత్తాన్ని పెంచుతారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసే సమయానికి వాస్తవ పని అనుభవం(సుమారు 2ప్లస్‌ సంవత్సరాలు) వస్తుంది.

పాఠ్యాంశాల ప్రణాళిక

పరిశ్రమలతో కలిసి కోర్సులకు రూపకల్పన చేస్తారు. ఏటా ఏఐ, పరిశ్రమ మార్పులకు అనుగుణంగా పాఠ్యక్రమాన్ని నవీకరిస్తారు. తద్వారా విద్యార్థులు భవిష్యత్‌ పనికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు నేర్చుకుంటారు.

ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌

క్యాంప్‌సలో స్టేషన్‌-ఎ్‌స అనే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. స్టేషన్‌-ఎ్‌స, టీఎన్‌ఏఎన్‌ సర్కిల్‌ వెంక్షర్‌సహాయంతో సుమారు 10 స్టార్టప్స్‌ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. ఇక్కడ పరిశ్రమ అనుకూల విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, సృజనాత్మక మేధస్సు పెంపొందిస్తారు.

అడ్మిషన్లు ప్రారంభం

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (స్కూల్‌ టు టెక్నాలజీ, ఏఐ), బీటెక్‌ అడ్వంచర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (స్కూలు అడ్వాన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌), బీబీఏ ఫైనాన్స్‌ అకౌంట్స్‌ (స్కూల్‌ బిజినెస్‌), బీబీఏ డిజిటల్‌ మీడియా, కమ్యూనికేషన్‌ (స్కూలు నొవా మీడియా) ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

పట్టభద్రుల్లో నైపుణ్యత పెంపే ధ్యేయం

‘డిగ్రీలు చదివిన వారిలో 50 శాతానికిపైగా ఉపాధికి సరిపడా స్కిల్స్‌ ఉండడం లేదు. ఈ స్కిల్‌గ్యా్‌పను భర్తీ చేసేందుకు శ్రీసిటీ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీని స్థాపించాం’ అని శ్రీసిటీ చైర్మన్‌ శ్రీనిరాజు పేర్కొన్నారు. ఎస్‌ఐయూ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘స్కిల్స్‌ లేకపోవడంతో 18-22 ఏళ్ల యువతలో ఎటువంటి ప్రొడక్టివిటీ కనిపించడం లేదు. వీరిలో 95 శాతం మంది మెంటరింగ్‌, హ్యాండ్‌ హోల్డింగ్‌ కోరుతున్నారు. సింగపూర్‌, కెనడా, జర్మనీ వంటి దేశాల్లోని వివిధ వర్సిటీలు వర్క్‌ స్టడీ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. గ్యారంటీ ఎంప్లాయిబిలిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు మాకు దిశా నిర్దేశం చేశారు. తదనుగుణంగా ఎస్‌ఐయూని తీర్చిదిద్దాం’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రవీణ్‌ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్నెగి మెలాన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ రాజారెడ్డి, కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి జీకే పిళ్లె తదితరుల సందేశాలను వినిపించారు.

శ్రీసిటీలో పరిశ్రమల ఉత్పత్తుల పరిశీలన

శ్రీసిటీ హెలిప్యాడ్‌ వద్ద మంత్రి లోకేశ్‌కు రవీంద్ర సన్నారెడ్డి, శ్రీనిరాజు, జేసీ గోవిందరావు, ఏఎస్పీ రవి మనోహరాచారి, ఎమ్మెల్యే ఆదిమూలం, టీడీపీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ శంకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో లోకేశ్‌ పొటోలు దిగారు. బిజినెస్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శ్రీసిటీ మోడల్‌, వివిధ పరిశ్రమల ఉత్పత్తుల నమూనాలు తదితరాలను పరిశీలించారు. ఎస్‌ఐయూ ప్రారంభోత్సవం అనంతరం ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, కంపెనీల ప్రతినిధులను పలకరిస్తూ ఫొటోలు దిగారు.

Updated Date - Jul 03 , 2026 | 12:27 AM