Share News

కరెంటు బిల్లు కట్టేందుకు డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:31 AM

కరెంటు బిల్లు దిగువన ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు. ఇంటి నుంచే కరెంటు బిల్లు కట్టేయవచ్చు.

కరెంటు బిల్లు కట్టేందుకు డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌
బిల్లులు చెల్లించేందుకు కౌంటర్‌ వద్ద క్యూలో నిలబడ్డ వినియోగదారులు

చిత్తూరు రూరల్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మన కరెంటు బిల్లు దిగువన ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు. ఇంటి నుంచే కరెంటు బిల్లు కట్టేయవచ్చు. దీనిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. వినియోగదారుల్లో చాలామంది ఇంకా విద్యుత్‌ శాఖ కార్యాలయానికి వచ్చి క్యూలో నిలబడి మరీ బిల్లులు కడుతున్నారు. పట్టణ ప్రాంతంలో 65 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ సేవలను వినియోగిస్తున్నట్లు అంచనా. విద్యుత్‌ బిల్లులు చెల్లింపులో డిజిటల్‌ చెల్లింపులు చాలకాలం కిందట మొదలైంది. మొదటగా ఫోన్‌పే, గూగుల్‌ పే ఇలా యూపీఐ యాప్‌ల ద్వారా వినియోగదారులు చెల్లించేవారు. ఆ తర్వాత ఏపీఎస్పీడీసీఎల్‌ యాప్‌, బిల్‌డెస్క్‌ ద్వారా బిల్లులు చెల్లించేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక డిజిటల్‌ పాలనపై దృష్టి పెట్టింది. విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను మరింత సులభతరం చేసింది. వినియోగదారుల బిల్లులోనే డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా నేరుగా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి బిల్లులు చెల్లించవచ్చు. ఇంత సులభతరం చేసినా ఇంకా ఎక్కువ మంది బిల్లు చెల్లింపునకు కౌంటర్ల వద్ద గంటల కొద్దీ లైన్లో నిలబడుతున్నారు. దీనిపై సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నా, ఇంకా కార్యాలయంలో బిల్లు కౌంటర్‌కు వస్తున్నారని డిస్కం ఈఈ మునిచంద్ర తెలిపారు. ఇప్పటికైనా వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులు చేసి సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు.

Updated Date - Feb 13 , 2026 | 12:31 AM