వాడివేడిగా డీవీఎంసీ సమావేశం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:38 AM
కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది.
తిరుపతి(కలెక్టరేట్), మార్చి 25(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది.ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడులో ఇసుక, గ్రావెల్ తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వరదయ్యపాళెం మండలం మెట్టపాళెం దళితవాడవాసులు గ్రావెల్‌ను అడ్డుకుంటే పోలీసులు పిలిచి కేసులు పెడుతున్నారని వాపోయారు.టీడీపీ కో-ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి ఇంటికి సెల్యూట్ కొడుతున్న పోలీసులు తనకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు, ఇంటి పట్టాల సమస్యలను పరిష్కరించాలన్నారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. డీవీఎంసీలో ప్రస్తావించే ప్రతి అంశానికి సంబంధించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు యంత్రాంగానికి సూచించారు. డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.