అంతటా కరువే..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:57 AM
25 మండలాల్లో తీవ్రం 78.60శాతం లోటు వర్షపాతం 46,055 హెకార్లకుగాను 16,606 హెక్టార్లలో సాగు
మదనపల్లె అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా అంతటా కరువేనని ప్రభుత్వం గుర్తించింది. మదనపల్లె, పీలేరు, రాయచోటి డివిజన్‌లలోని 25 మండలాల్లోనూ తీవ్రంగా ఉందని పేర్కొంటూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జీవో నంబర్ 4ను విడుదల చేశారు. 2026 ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కరువు పరిస్థితులను విశ్లేషించి ప్రభుత్వం ముందస్తు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 380 మి.మి. కాగా, 61.80 మి.మి. పడగా, 78.60 మి.మి. లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షం పడాల్సి ఉండగా సెప్టెంబరులో కురిసింది. ఫలితంగా జూలైలో 96శాతం, ఆగస్టులో 22శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇలా 70రోజులకుపైగా వర్షమే లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ పూర్తిగా ఎత్తిపోయిందని వ్యవసాయశాఖ చెబుతోంది.
సాగు విస్తీర్ణం 36 శాతమే
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 46,055 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా కేవలం 16,606 హెక్టార్లు మాత్రమే సాగయ్యాయి. సాగు విస్తీర్ణం 36శాతం నమోదైంది. వేరుశనగ 27,015 హెక్టార్లకు గాను 6,953 హెక్టార్లలో సాగైంది. వరి 12,725 హెక్టార్లకు బదులు 7,446 హెక్టార్లు నమోదైంది. మొక్కజొన్న 2,213 హెక్టార్లకుగాను 1,079 హెక్టార్లు సాగైంది. కంది 1,597 హెక్టార్లకు గాను 456 హెక్టార్లలో వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఆలస్యంగా కరువు ప్రకటన
కరువు మాన్యువల్ ప్రకారం ఏటా అక్టోబరు 31వ తేదీలోగా ఖరీ్‌ఫ్ కరువును ప్రకటించాల్సి ఉంది. అయితే 2026 జూన్-ఆగస్టు నెలల్లో 78.60 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అదే సమయంలో ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ నుంచి ఆగస్టు వరకూ అందుబాటులో ఉన్న సమాచారాన్ని, కరువు సూచికను పరిశీలించి 2026 ఖరీ్‌ఫకు ముందస్తుగా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రకటన చేసినట్లు వ్యవసాయశాఖ చెబుతోంది. 2026 జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకూ నమోదైన వర్షపాతం, జూన్ 7 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకూ నమోదైన డ్రైస్పెల్ (వర్షాభావ కాలం) వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు.
సహాయక చర్యలకు కార్యచరణ
ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని కరువు ప్రభావిత మండలాలు, ప్రాంతాలను జిల్లా గెజిట్‌లో అధికారికంగా కలెక్టర్ నోటిఫై చేయనున్నారు. తద్వారా కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు రుణ సదుపాయం అందించేందుకు, అవసరమైన సహాయక చర్యలు (రిలీఫ్ ఆపరేషన్స్) చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తారు.
కరువు మండలాల జాబితా ఇదీ..
గాలివీడు, సంబేపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, గుర్రంకొండ, కలకడ, కె.వి.పల్లె, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పీటీఎం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, చౌడేపల్లె, రామసముద్రం, పుంగనూరు, చిన్నమండెం, సదుం, సోమల ఈ జాబితాలో ఉన్నాయి.