రూ.4కోట్ల స్థలాలకు డబుల్ రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:28 AM
గత ప్రభుత్వంలో మాజీ మంత్రి బంధువు దందా సంపూర్ణంగా సహకరించిన సబ్‌రిజిస్ట్రార్ శోభారాణి బాధితుల ఫిర్యాదుతో రెండేళ్లకుపైగా సాగిన విచారణ అక్రమాలు రుజువైనా ఏడాది ఇంక్రిమెంట్ కోతతో సరి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల తీరిది
తిరుపతి, ఆంధ్రజ్యోతి: స్థలం యజమాని ఒకరు. కొన్నది డాక్టరు మాధవీలత. తనదంటూ క్లెయిమ్ చేసుకుని.. ఇతరులకు విక్రయించారు పార్వతి. ఈమెను ముందుంచి కథ నడిపింది గత ప్రభుత్వంలోని మంత్రి బంధువు. దీనికి సహకారం అందించి.. వెనకా ముందు చూడకుండా ఆ స్థలాన్ని మరోసారి రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి రేణిగుంట సబ్‌రిజిస్ట్రారు శోభారాణి. ఈ వ్యవహారంలో అక్రమంగా అమ్మిన వారు బాగున్నారు.. సబ్‌రిజిస్ట్రారుకు ఏడాదిపాటు ఇంక్రిమెంట్ కోత వంటి స్వల్ప చర్యలతో సరిపెట్టేశారు. కానీ, 18 ఏళ్ల కిందట స్థలాన్ని కొన్న డాక్టర్ మాధవీలత మాత్రం.. మూడేళ్లుగా తన సొంత స్థలంలో అడుగు పెట్టలేకపోతున్నారు.
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు లెక్క దాఖలా పద్మావతీపురం సర్వే నెంబరు 251-8లో 32 సెంట్లతో కూడిన తుడా అప్రూవ్డ్ లేఅవుట్‌లో 15, 16, 21, 22 నెంబర్ల ప్లాట్లను పార్వతి అనే మహిళ ఇతరులకు విక్రయించారు. 2023లో ఈ విక్రయాలు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 3592-2023, 3593-2023, 3599-2023, 3600-2023 డాక్యుమెంట్ల నెంబర్లతో రిజిస్టర్ అయ్యాయి. పార్వతిని ముందుపెట్టి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రికి బంధువొకరు ఈ దందా నడిపించారు. ఈ నాలుగు ప్లాట్ల ప్రభుత్వ ధర రూ.1.50 కోట్లు. బహిరంగ మార్కెట్‌లో రూ.4 కోట్లు.
బాధితురాలి ఫిర్యాదుతో..
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ప్రముఖ వైద్యురాలు మాధవీలత ఈ స్థలాలను తాము 2008లో కొన్నామని, 2023లో నిర్మాణం కోసం ప్రయత్నించగా అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి తెలిసిందంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. ఇనాందారు సింగరాచారి నుంచి 1970లో కేఆర్ కృష్ణారెడ్డి వంద ఎకరాల ఇనాం భూములు కొనుగోలు చేశారు. 1979లో కృష్ణారెడ్డి కుటుంబీకులు ఆ భూములను కోర్టు ద్వారా పంచుకున్నారు. తిరుమలశెట్టి రాజారామ్ అనే వ్యక్తి సి.కృష్ణారెడ్డి నుంచి ఈ భూమిని 1985లో కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించి ఆ ఏడాదిలోనే తనపేరిట రైత్వారీ పట్టా మంజూరు చేయించుకున్నారు. 1986లో ఆ భూమిని పోలీసు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి విక్రయించారు. 1991లో పోలీస్ సొసైటీ సంబంధిత భూమిలో లే అవుట్ వేయగా అందులో 251-8 సర్వే నెంబరులోని 32 సెంట్లు కూడా ఉందని తెలిసి భూమి వాస్తవ యజమాని కేఆర్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విచారించి భూమి ఆయనదేనని తేల్చి 1996లో కేఆర్ కృష్ణారెడ్డి పేరిట రైత్వారీ పట్టా మంజూరు చేశారు. ఆ ఏడాదిలోనే రాజారామ్ చనిపోయారు. కేఆర్ కృష్ణారెడ్డి కోర్టు ద్వారా పోలీసు హౌసింగ్ సొసైటీతో రాజీ కుదుర్చుకుని 2005లో మొత్తం లే అవుట్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఅవుట్‌లో కేఆర్ కృష్ణారెడ్డి కుటుంబీకుల నుంచి డాక్టర్ మాధవీలత కుటుంబం 2008లో నాలుగు ప్లాట్లు కొనుగోలు చేసింది. ఈ లే అవుట్‌కు తుడా అనుమతులూ ఉన్నాయి.
నిబంధనలు ఉల్లంఘించిన సబ్ రిజిస్ట్రార్
డాక్టర్ మాధవీలత చేసిన ఫిర్యాదుతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు రెండేళ్లకుపైగా విచారణ సాగదీశారు. విచారణలో సబ్ రిజిస్ట్రార్ శోభారాణి చేసిన తప్పిదాలన్నీ వెలుగు చూశాయి. తాను తిరుమలశెట్టి రాజారామ్ మేనకోడలిని అంటూ వారసురాలి హోదాలో పార్వతి రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేయగా, ఆమెకు ఆస్తి ఎలా వచ్చిందన్నది సబ్ రిజిస్ట్రార్ పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన పోలీసు హౌసింగ్ సొసైటీకి విక్రయించేసిన భూమి మళ్లీ పార్వతికి ఎలా దక్కిందన్న ప్రశ్నను సబ్ రిజిస్ట్రార్ విస్మరించారు. రాజారామ్.. పార్వతి తల్లి పద్మావతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ లేకుండానే సబ్ రిజిస్ట్రార్ ఆ స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసేశారు. రాజారామ్ అవివాహితుడు. ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నారు. వారంతా కూడా రాజారామ్ ఆస్తికి వారసులవుతారు. వారందరినీ పక్కన పెట్టి ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరి కుమార్తె అయిన పార్వతి మాత్రమే ఎలా వారసురాలవుతుందన్నది కూడా సబ్ రిజిస్ట్రార్ పట్టించుకోలేదు. 1985లో రాజారామ్ పేరిట జారీ అయిన రైత్వారీ పట్టా ఆధారంగా శోభారాణి ఆ స్థలాలను రిజిస్టర్ చేశారు. 1985-2023 మధ్య భూమి లావాదేవీలు ఏమి జరిగాయన్నది పట్టించుకోలేదు. పార్వతి ఈసీ కూడా సమర్పించలేదు. సబ్ రిజిస్ట్రార్ ఆ విషయం కూడా విస్మరించారు. నిజానికి ఈసీలో సంబంధిత భూమిని పోలీసు సొసైటీకి విక్రయించినట్టు స్పష్టం చేస్తోంది. సంబంధిత భూమిలో ప్లాట్లు వేశానని పార్వతి క్లెయిమ్ చేశారు. అయితే 1985 నాటి ఆమె సమర్పించిన డాక్యుమెంట్‌లో 32 సెంట్లు అని ఉంది. ప్లాట్లు వేస్తే ల్యాండ్ కన్వెర్షన్ చేసి ఉండాలి. ఎల్‌ఆర్‌ఎస్ కట్టాలి. కానీ అవేమీ లేదు. ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలు లేవు. సబ్ రిజిస్ట్రార్ వాటినీ పట్టించుకోలేదు. దానికి తోడు పార్వతి రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్ కాకుండా సర్టిఫైడ్ కాపీలు సమర్పించారు. భూమి విస్తీర్ణం 10 సెంట్లు దాటితే సబ్ రిజిస్ట్రార్ వన్ బీ, ఆన్‌లైన్‌లో వెబ్‌ల్యాండ్ రికార్డును పరిశీలించాలి. అవేవీ చూడలేదు. పార్వతి సమర్పించిన భూమి పత్రాల సర్టిఫైడ్ కాపీ్‌సలో ఒకచోట సర్వే నెంబరు 251-8 అని, మరో చోట 258-1 అని వేర్వేరు నెంబర్లు ఉన్నాయి. వాటిని కూడా సబ్ రిజిస్ట్రార్ పట్టించుకోలేదు. ఇలా నిబంధనలన్నీ ఉల్లంఘించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని విచారణ జరిపిన ఉన్నతాధికారులు తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు.
రిజిస్ట్రేషన్లు రద్దు.. పార్వతిపై క్రిమినల్ కేసు
బాధితురాలు డాక్టర్ మాధవీలత 2023 సెప్టెంబరు 15న జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణ చేపట్టారు. 2023-24లో మూడు సార్లు విచారణ నిమిత్తం ఫిర్యాదిని, సబ్ రిజిస్ట్రార్ శోభారాణిని, పార్వతిని హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా పార్వతి ఒకసారి మాత్రమే హాజరయ్యారు. 2024 ఆగస్టు 27న జిల్లా రిజిస్ట్రార్ విచారణ ముగించి నివేదిక ఇచ్చారు. అందులో పార్వతి క్లెయిమ్ చేసిన భూమికి అసలైన యజమాని ఎప్పుడో అమ్మేశారని తేల్చారు. 1986 నాటి డాక్యుమెంట్ నెంబరు 5895 ద్వారా చేసిన క్లెయిమ్ అక్రమమని తేల్చారు. విచారణలో పార్వతి సమర్పించిన సర్టిఫికెట్ తప్పుడు పత్రమని తేల్చారు. సంబంధిత నాలుగు రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఈ నివేదిక ఆధారంగా బాధితురాలు డాక్టర్ మాధవి 2024లోనే పార్వతిపై తిరుపతి ఫస్ట్ ఏడీజే కోర్టులో సీసీ నెంబరు 1543-2025 (సీఎఫ్ నెంబరు 109-2025) మేరకు క్రిమినల్ కేసు పెట్టారు. ఇప్పటి వరకూ పోలీసులు పార్వతి జాడ కనుక్కోలేదు. చెన్నైలో తప్పుడు అడ్రసు ఇచ్చారంటూ పోలీసులు దర్యాప్తును పక్కన పెట్టేశారు. ఈ దందా వెనుక అప్పటి వైసీపీ మంత్రి బంధువు ఒకరు ఉన్నందున బాధితురాలు ఇప్పటికీ తన స్థలంలోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు అక్రమార్కులకే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సబ్ రిజిస్ట్రార్‌పై తగిన చర్యలేవీ?
విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయినప్పటికీ అప్పటి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ శోభారాణిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. శాఖాపరంగా స్వల్ప చర్యలతో సరిపెట్టుకున్నారు. ఫిర్యాదు అందిన రెండేళ్లకుపైగా గడిచాక 2025 నవంబరులో కేవలం ఒక వార్షిక గ్రేడ్‌ఇంక్రిమెంట్‌ను అది కూడా ఏడాది పాటు మాత్రమే కోత విధిస్తూ సుతిమెత్తటి చర్యలతో వదిలిపెట్టేశారు. విచారణ సందర్భంగా ఏ దశలోనూ తాను తప్పు చేశానని ఆమె అంగీకరించలేదు. నిబంధనల మేరకే నడుచుకున్నానని సమాధానమిచ్చారు. ఆ విషయాన్ని స్వయంగా విచారణాధికారే నివేదికలో పేర్కొనడం గమనార్హం. తీవ్ర చర్యలకు గురి కావాల్సిన ఆమె దానికి భిన్నంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.