బెట్టింగ్ జోలికెళ్లద్దురో
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:21 AM
క్రికెట్‌లో బంతి బంతికీ పందెం చితికిపోయిన జీవితాలెన్నో? నేటి నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభం
పెనుమూరు, ఆంధ్రజ్యోతి: మొదట క్రేజీగా ఉంటుంది. ఆ తర్వాత అలవాటుగా మారి.. వ్యసనమవుతుంది. వడ్డీ ఎంతైనా సరే, అప్పులు చేయమంటుంది. ఇలా క్రికెట్ బెట్టింగులతో ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకున్నారు... చేసుకుంటున్నారు. ఐపీఎల్ వచ్చేసరికి ఇది మరింత తీవ్రమైంది. శనివారం నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవుతోంది. ఈ క్రమంలో బెట్టింగ్ జోలికెళ్లద్దురో.. అని కుటుంబీకులు, అధికారులూ సూచిస్తున్నారు.
పచ్చని కాపురాలను బెట్టింగ్ మహమ్మారి కూల్చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కోసం యువత బెట్టింగ్ లాంటి వక్ర మార్గాలను ఎంచుకుంటోంది. తల్లితండ్రులకు తెలియకుండా చాలా మంది వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 నుంచి రూ.20 వరకు వడ్డీకి తీసుకుని మ్యాచ్ ముగియగానే తిరిగి చెల్లిస్తారు. ఓడినవారు తమ సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాలు, ల్యాప్‌టా్‌పలు, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిస్తున్నారు. అలా ఇవ్వలేని వారు ఆత్మహత్య చేసుకోవడం, ఇతర నేరాలకు అలవాటుపడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది యువకులు బెట్టింగులకు చేసిన అప్పులు ఇంట్లో తెలిస్తే ఏమంటారోనని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది తల్లిదండ్రులు భూములు అమ్మి పిల్లలు చేసిన అప్పులు తీరుస్తున్నారు. రోజు కూలీ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని బయటపడలేకపోతున్నారు. ఒకప్పుడు క్రికెట్‌లో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై బెట్టింగులు వేసేవారు. ఐపీఎల్ వచ్చాక మరింత ఎక్కువైంది. ప్రస్తుతం టాస్ మొదలు బంతి బంతికీ, ఓవర్‌కి, సిక్సర్, ఫోర్, డాట్‌బాల్, ఆటగాళ్లపై ఇలా ఎన్నో రకాలుగా పందేలు కాస్తున్నారు. స్మార్ట్ ఫోన్లనో బెట్టింగ్ అందుబాటులో ఉండటంతో యువతకు సులభతరమవుతోంది.
మూడో కంటికి తెలియకుండా ఆన్‌లైన్‌లో
కొందరు సమాజంలో తమకున్న విలువ పోతుందని మూడో కంటికి తెలియకుండా ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌లు ఆడుతున్నారు. బ్యాంకు అకౌంట్ల నుంచి వాటిలోకి డిపాజిట్ చేసుకుని అందులో ఆడుతున్నారు. గెలిచిన వెంటనే తమ అకౌంట్‌కు విత్‌డ్రా చేసుకుంటారు. యాప్‌లపై అవగాహన ఉన్నవారు, ఉద్యోగస్తులు, చదువుకున్నవారు వీటిలోనే బెట్టింగ్ పెడుతున్నారు.
ప్రతి మ్యాచ్‌కు రూ.2 కోట్లపైనే
ఉమ్మడి జిల్లాలో ప్రతి మ్యాచ్‌కి సుమారు రూ.2 కోట్లపైనే చేతులు మారుతాయని అంచనా. ఈ లెక్కన ఐపీఎల్ పూర్తయ్యే నాటికి రూ.150 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగే అవకాశముంది. మొదట పట్టణాల్లో ఉన్న ఈ బెట్టింగ్ సంస్కృతి ఇప్పుడు పల్లెల్లోనూ జోరుగా సాగుతుంది. చిత్తూరు, పలమనేరు, పెనుమూరు, పాకాల, వి.కోట, కుప్పం వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతాయి. బెంగళూరులోని పెద్ద బుకీల వద్ద లైన్ అకౌంట్లు తీసుకుని స్థానికంగా లాడ్జీలు, ప్రైవేటు హోటళ్లు, అద్దె భవనాల్లో పోలీసుల కళ్లుకప్పి బెట్టింగ్‌లు నడుపుతున్నారని సమాచారం.
వీళ్ల జీవితం కావాలి గుణపాఠం
గంగాధరనెల్లూరుకు చెందిన దినేష్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చలేక తండ్రి నాగరాజులురెడ్డి, తల్లి జయంతి, అక్క సునీతతోపాటు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి బెట్టింగ్ మూలంగానే నలుగురూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
పెనుమూరు మండలలో ఓ యువకుడు బెట్టింగులు ఆడి చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డ ఏమైపోతాడోనని వాళ్లు ఉన్న ఎకరం పొలం అమ్మి కుమారుడి అప్పు చెల్లించారు.
రేణిగుంటలో ఓ యువకుడు ఆస్పత్రిలో పనిచేసుకుంటూ స్నేహితుల వద్ద డబ్బులు తీసి బెట్టింగ్ ఆడి పోగొట్టాడు. తీరా వారికి సమాధానం చెప్పలేక గత ఏడాది తిరుపతి నగరంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని చనిపోయాడు.
ఇలానే బెట్టింగులతో అప్పులపాలై గతేడాది పలమనేరులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.
జీవితం నాశనం చేసుకోవద్దు
యువత ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లితండ్రులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్‌లు ఆడి డబ్బు సంపాదించినవారు ఎవ్వరూ లేరని యువత గ్రహించాలి. జిల్లాలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై మీద నిఘా పెట్టాం.
- తుషార్ డూడి, ఎస్పీ