Share News

అసత్య ప్రచారాన్ని నమ్మి ఆందోళన పడొద్దు

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:44 AM

పెట్రోల్‌, డీజల్‌ కొరతపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు కోరారు.ఆదివారం రాత్రి వారిద్దరూ తిరుపతిలోని మహతి ఆడిటోరియం సమీపంలో వున్న పెట్రోల్‌ బంకును తనిఖీ చేశారు.

అసత్య ప్రచారాన్ని నమ్మి ఆందోళన పడొద్దు
పెట్రోల్‌ బంకు వద్ద వాహనదారుతో మాట్లాడుతున్న కలెక్టర్‌,ఎస్పీ

తిరుపతి(కొర్లగుంట/కలెక్టరేట్‌),ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజల్‌ కొరతపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు కోరారు.ఆదివారం రాత్రి వారిద్దరూ తిరుపతిలోని మహతి ఆడిటోరియం సమీపంలో వున్న పెట్రోల్‌ బంకును తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌సీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ కంపెనీల అవుట్‌ లెట్లు 185వుండగా 8 అవుట్‌ లెట్లలో మాత్రమే తాత్కాలిక కొరత ఏర్పడిందని తెలిపారు. సోమవారం ఉదయం 8గంటలకల్లా పెట్రోల్‌,డీజల్‌ సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.తాత్కాలిక ఇబ్బందులను అదునుగా తీసుకొని బ్లాక్‌మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ పెట్రోల్‌ కొరత ఏర్పడిందని చేస్తున్న అసత్య ప్రచారం కారణంగా ప్రజలు భయాందోళనకు గురై పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరుతున్నారని తెలిపారు. అవసరం లేకపోయినా ట్యాంక్‌ ఫుల్‌ చేయవలసిందిగా పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. రోజువారీ వినియోగానికి అవసరమైన పెట్రోలు, డీజల్‌ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.డీఆర్వో నరసింహులు, ఆర్డీవో రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్‌బంకుల్లో జేసీ తనిఖీలు

తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకులను జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు ఆదివారం సాయంత్రం తనిఖీ చేశారు.బంకుల నిర్వహణ, ఇంధన నాణ్యత, కొలతలను జిల్లా సివిల్‌ సప్లై అధికారి రాజు, తహసీల్దారు సురే్‌షబాబుతో కలసి పరిశీలించారు. ఐఓసీఎల్‌ నుంచి ఇంధన సరఫరా ఆలస్యం కావడం వల్లే ఇబ్బంది తలెత్తిందన్నారు. దీనికితోడు పెట్రోల్‌, డీజల్‌ కొరత ఉందని ప్రచారం జరగడంతో పెట్రోల్‌ బంకుల వద్దకు పెద్దఎత్తున వినియోగదారులు క్యాన్లు పట్టుకుని నిల్వ ఉంచుకునేందుకు సిద్ధమవడంతో పలు బంకుల్లో డీజిల్‌ ఖాళీ అయిందన్నారు.సోమవారం నుంచి ఇంధన సరఫరా అన్ని బంకులకు యధావిధిగా కొనసాగుతుందని, కాబట్టి ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని సూచించారు.

Updated Date - Apr 27 , 2026 | 01:44 AM