Share News

వైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:22 AM

వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో సదస్సులు, చర్చా గోష్ఠులు, సమావేశాలు నిర్వహించుకుంటున్నాం

వైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
అనిల్‌కుమార్‌ నాయక్‌ను సన్మానిస్తున్న డాక్టర్లు

తిరుపతి సెంట్రల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ‘వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో సదస్సులు, చర్చా గోష్ఠులు, సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. అయితే కాలానికి అనుగుణంగా వైద్యులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి’ అని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ నాయక్‌ సూచించారు. తిరుపతి అర్బన్‌ హట్‌లో ఆదివారం ఐఎంఏ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి వివిధ రంగాల్లో వైద్య నిపుణులు హాజరయ్యారు. ముఖ్య అతిఽథి అనిల్‌కుమార్‌ నాయక్‌ మాట్లాడుతూ.. వైద్యులు పాత తరం వైద్యానికి స్వస్తి పలికి రోగి కేంద్రిత సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కృత్రిమ మేధస్సు.. వైద్యులకు సహాయకారిగా మారుతుందే తప్ప వైద్యుల స్థానాన్ని భర్తీ చేయదన్నారు. ప్రతి వైద్యుడు నిరంతర శిక్షణ ద్వారా తాజా వైద్య విధానాలను తెలుసుకుంటూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. రోగి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శాస్ర్తీయ పరిశోధనలను ప్రోత్సహించడం, నైతిక విలువలను కాపాడుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. వైద్యసేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఇటువంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. ఐఎంఏ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డాక్టర్‌ ఏఆర్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, అది సేవా ధర్మమన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలే కానీ రోగితో మానవీయ అనుబంధాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలను అరికట్టడానికి కఠిన చట్టాలు అవసరమన్నారు. ఆస్పత్రులకు, వైద్యులకు బీమా తప్పనిసరన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్‌, ట్రామా కేర్‌, గోల్డెన్‌ అవర్‌ చికిత్సలపై వైద్యులు నిరంతర శిక్షణ పొందాలన్నారు. అనంతరం పలువురు వైద్యులు వైద్య రంగానికి ఉపయోగపడే కీలక సూచనలు చేశారు. సదస్సులో రుయా మెడికల్‌ సూపరింటెండెంట్‌ మనోహర్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం, ఐఎంఏ కోచైర్మన్‌ జనార్దన్‌, మాజీ జాతీయ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీహరిరావు, డాక్టర్లు సుబ్బారావు, రెడ్డెప్ప, సతీష్‌ బిల్లా, రవిరాజు, రాయపాటి రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:22 AM