Share News

అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దు

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:51 AM

అవసరానికి మించి ఎవరూ ఇంధనం నిల్వ చేసుకోవద్దని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.

అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దు

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): అవసరానికి మించి ఎవరూ ఇంధనం నిల్వ చేసుకోవద్దని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందనే తప్పుడు ప్రచారంతో వినియోగదారులు ఆందోళనతో రెండు మూడు రోజులుగా బల్క్‌గా ఇంధనం కొనుగోలు చేయడంతో డిమాండ్‌ పెరిగిందన్నారు. దీంతో డిమాండ్‌-సప్లై మధ్య తాత్కాలిక అసమతౌల్యం ఏర్పడిందన్నారు.జిల్లాలో 189 పెట్రోల్‌ బంకులుండగా, 26 తాత్కాలింగా మూతబడ్డాయని, వాటిని కూడా పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, నయారా, రిలయన్స్‌ సంస్థల ప్రతినిధులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా రెండు బంకులకు అదనపు సరఫరా పంపించామన్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వ్యవసాయావసరాలకు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు డీజల్‌ జనరేటర్ల ప్రాధాన్యత క్రమంలో ఇంధనం అందిస్తున్నామని తెలిపారు.తప్పుడు ప్రచారం చేసి వదంతులు వ్యాపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డిమాండ్‌కు తగ్గ స్టాక్‌ తెప్పించండి

పెట్రోల్‌బంకుల్లో డిమాండ్‌కు తగ్గట్టుగా పెట్రోల్‌, డీజల్‌ స్టాక్‌ తెప్పించుకోవాలని ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, నయార ఇంధన కంపెనీ సేల్స్‌ అధికారులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి కలెక్టరేట్‌లో సోమవారం ఇంధన కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరానికి తగట్టుగా పెట్రోల్‌, డీజల్‌ తెప్పించాలని, కొరత లేకుండా చూడాలన్నారు. ఇంధన నిల్వలు లేవని, పెట్రోల్‌బంకులు మూత వేయకుండా తగినంత నిల్వలు తెప్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ గోవిందరావు, జిల్లా సివిల్‌ సప్లై అధికారి శేషాచల రాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:51 AM