Share News

ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా!

ABN , Publish Date - May 25 , 2026 | 12:49 AM

ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ గంటలో అత్యవసర చికిత్స అందితే 25 శాతం బాధితుల ప్రాణాలు నిలుస్తాయని వైద్యులే చెబుతారు. సాధారణంగా రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు ఈ తరహా వైద్యసేవలు ట్రామా సెంటర్‌లో లభిస్తాయి.

ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా!
మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రి

పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలు

జిల్లా ఆస్పత్రిలో ఏదీ ట్రామాకేర్‌ సెంటర్‌?

పెద్దాస్పత్రులకు తరలించేలోపే మృత్యువాత

పరికరాలు లేక ఆర్థో కేసులన్నీ రెఫర్‌

సంవత్సరం రోడ్డు ప్రమాదాలు మృతుల సంఖ్య

2024 596 307

2025 663 355

2026(మే) 200 90

ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ గంటలో అత్యవసర చికిత్స అందితే 25 శాతం బాధితుల ప్రాణాలు నిలుస్తాయని వైద్యులే చెబుతారు. సాధారణంగా రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు ఈ తరహా వైద్యసేవలు ట్రామా సెంటర్‌లో లభిస్తాయి. మన జిల్లా కేంద్ర ప్రభుత్సాత్రిలో ఈ సెంటర్‌ లేకపోవడం బాధాకరం. ఫలితంగా ఏన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

- మదనపల్లె క్రైం, ఆంధ్రజ్యోతి

మదనపల్లెలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి స్థాయి పెరిగినా అత్యవసర సేవలకొచ్చేసరికి పెదవివిరుపే. ఇక్కడ ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాద మరణాలను అరికట్టవచ్చుంటూ ఆస్పత్రి అధికారులు పంపుతున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. దీంతో పడమట ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దాస్పత్రులకు తరలించేలోపే మృత్యువాతపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆర్థో కేసులన్నీ రెఫర్‌ చేసేస్తున్నారు. వైద్యులు అందుబాటులో ఉన్నా ప్రత్యేక పరికరాలు లేవు. ఈ నేపథ్యంలో వచ్చిన కేసులు వచ్చినట్టే క్యాజువాలిటీ నుంచి రెఫర్‌ చేసేస్తున్నారు.

ప్రమాదాల జోరు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో జిల్లా ఐదో స్థానంలో ఉంది. జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో బ్లాక్‌ స్పాట్లు, ఘాట్‌ రోడ్లు, ప్రమాదకర మలుపులు, యాక్సిడెంట్‌ జోన్లు ఎక్కువే. అందువల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన అత్యవసర చికిత్స అందించాలంటే ట్రామాకేర్‌ సెంటర్‌ అవసరం. ఈ సెంటర్‌ లేని కారణంగా బాధితులు చివరి క్షణంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతోపాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి రోడ్డు ప్రమాద బాధితులు ఇక్కడి జిల్లా ఆస్పత్రికి వస్తుంటారు. ముఖ్యంగా అమ్మచెరువుమిట్ట, తానామిట్ట, కూనీతోపు, కాశీరావుపేట, సుగాలిమిట్ట, చెంబకూరు రోడ్డు, మదనపల్లె బైపా్‌స రోడ్డు, పుంగనూరు రోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు, ఎద్దులవారిపల్లెమిట్ట తదితర ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే రోడ్డు ప్రమాద బాధితులను 108 వాహనాల్లో నేరుగా జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తుంటారు.

పెద్దాస్పత్రులకు రెఫర్‌

జిల్లా ఆస్పత్రికి ప్రమాద బాధితులను తీసుకువచ్చాక ట్రామా కేర్‌ లేదని తెలియగానే నీరుగారిపోవాల్సి వస్తోంది. కాళ్లుచేతులు, శరీర భాగాల్లోని ఎముకలు విరిగి, తలకు బలమైన గాయాలైన కేసులను తిరుపతి, బెంగళూరు ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది సిటీ స్కాన్‌ వంటి అత్యాధునిక పరికరాలు కూడా అందుబాటులో లేవు. డాక్టర్లు ఉన్నా పరికరాలు లేక ఆర్థో శస్త్రచికిత్సలు జరగడం లేదు. అధికారులు స్పందించి ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రతిపాదనలు పంపుతున్నాం..

జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం పదేపదే ప్రతిపాదనలు పంపుతున్నాం. అన్ని ప్రాంతాలకు మదనపల్లె కేంద్ర బిందువు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా క్షతగాత్రులను నేరుగా ఇక్కడికే తరలిస్తారు. ఇక్కడ ట్రామాకేర్‌ సెంటర్‌ అందుబాటులో లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యను మరోసారి ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తాం.

-డాక్టర్‌ రాధిక, ఆర్‌ఎంవో, జిల్లా ప్రభుత్వాస్పత్రి.

Updated Date - May 25 , 2026 | 12:49 AM