Share News

ఇప్పుడైనా న్యాయం చేయండి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:53 AM

మూడేళ్ల క్రితం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేరు చెప్పి రాజంపేటలో అరాచకం సృష్టించిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడైనా న్యాయం చేయండి
భూమన అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మణి

- ప్రజాస్వామ్యయుతంగా పెట్టిన కామెంట్‌కు కరుణ, అభినయ్‌ నన్ను చంపాలని చూశారు

- ఆయన అనుచరులు నా నాలుక కోశారు..కంటిపై రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టారు

- హోంమంత్రికి ఫిర్యాదు చేసిన మన్నూరువాసి

తిరుపతి సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల క్రితం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేరు చెప్పి రాజంపేటలో అరాచకం సృష్టించిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. రాజంపేట పట్టణం మన్నూరుకు చెందిన టీడీపీ నేత పత్తి మణి తన ఫేస్‌బుక్‌లో వైసీపీకి వ్యతిరేకంగా పోస్ట్‌ పెట్టారన్న కారణంతో తిరుపతినుంచి 14 మంది రెండు వాహనాల్లో వెళ్లి కిడ్నాప్‌ చేసి, దారుణంగా చావబాదిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనను అప్పట్లో టీడీపీ యువనేత నారా లోకేశ్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. అయితే తాజాగా శనివారం బాధితుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో హోంమంత్రి అనితకు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎండీ నజీర్‌లకు దీనిపై వినతిపత్రం ఇచారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌తో పాటు మరో 14మందిపై చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థించడంతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.

ఫ అప్పుడేం జరిగింది?

పత్తి మణి ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... 2023 జూన్‌ 9న అప్పటి తిరుపతి డిప్యూటీ మేయర్‌ అభినయ్‌ సోషల్‌ మీడియాలో ‘నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లను తిరుపతిలో అడుగుపెట్టనివ్వం’ అని ఒక పోస్ట్‌ పెట్టారు. దీనిపై పత్తి మణి ‘ఇది రాచరికపు పాలన కాదు, ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. మీరు కూడా నందలూరు నుంచి తిరుపతికి వెళ్లలేదా?’ అని ఫేస్‌బుక్‌లో రిప్లై కామెంట్‌ పెట్టారు. దీనిని మనసులో పెట్టుకుని భూమన అనుచరుడు రాజు మరికొంతమందితో కలసి రాజంపేట హరిత హోటల్‌ దగ్గర ఉన్న మణిపై దాడిచేశారు. బలవంతంగా కిడ్నాప్‌ చేసి కారులో వేశారు.నాలుక కోశారు. చేతి నరాలు కట్‌ చేశారు కంటిపై రాళ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. దాడి జరుగుతున్న సమయంలో నిందితులు అప్పటి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, అభినయ్‌లకు వీడియోకాల్‌ చేసి చూపించారు. ‘వీడిని బాగా కొట్టి, చంపేసి అలిపిరి అడవిలో పారేయండి’ అని ఆదేశాలు ఇచ్చారు. ఇంతలో మణి కనిపించడంలేదన్న ఫిర్యాదుతో రాజంపేట పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న నిందితులు రాపూరు మీదుగా తిరుపతికి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ చిట్వేలి మూడు రోడ్లు కూడలి వద్ద పోలీసులు నిందితుల కార్లను పట్టుకున్నారు. మణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను మన్నూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇంతలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచి డీఎస్పీ చైతన్య యాదవ్‌కు ఫోన్‌ రావడంతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి, రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీస్‌ సెక్యూరిటీతో తిరుపతికి పంపించేశారు.

ఫ వాహనాలు తిరుపతికి చెందినవి

మణిపై దాడికి పాల్పడిన వాహనాలు తిరుపతికి చెందినవిగా గుర్తించారు. ఏపీ03 బీపీ 6666 నెంబరుగల మహీంద్రా ఎక్స్‌యువీ కారుతో పాటు, నెంబరు రాని కొత్త ఫోర్డ్‌ ఎండోవర్‌ వాహనాలను మన్నూరు పోలీసులు సీజ్‌ చేశారు. మహీంద్రా వాహనం ఎర్రమిట్టలోని ఎ.రమణయ్య కుమారుడు ఎ.ఆనంద్‌ పేరుతో రిజిస్టర్‌ అయివుంది. అదేవిధంగా నెంబరు ప్లేట్‌పై హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ అని వుంది.

ఫబాధితుడి పైనే అక్రమ కేసులు

చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పత్తి మణిపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పత్తి మణి ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడని కేసు నమోదు చేశారు. నిందితులను మాత్రం పోలీస్‌ ఎస్కార్ట్‌తో సాగనంపారు. అంతేకాకుండా అతని భార్యను, మూడు సంవత్సరాల కొడుకును మన్నూరు పోలీస్‌ స్టేషన్‌లో సుమారు 4 గంటల పాటు అక్రమంగా నిర్భంధించారు. వైసీపీ అరాచకాలకు భయపడిన మణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ధైర్యం చేసి హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 28 , 2026 | 12:53 AM