Share News

కూటమికి దీపావళి

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:34 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించిన అధికార కూటమి పరిషత్‌ ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అధిక సంఖ్యలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు నిజమైన దీపావళిని ఆస్వాదిస్తున్నారు.

కూటమికి దీపావళి
చిత్తూరులోని పీవీకేఎన్‌కళాశాలలోఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌

పరిషత్‌ ఎన్నికల్లో పసుపు ప్రభంజనం

జడ్పీటీసీలు.. టీడీపీ 22, జనసేన 1, వైసీపీ 3..

పెనుమూరు జడ్పీటీసీ స్థానానికి రీకౌంటింగ్‌

ఎంపీపీలు.. టీడీపీ 26, వైసీపీ 1

చిత్తూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించిన అధికార కూటమి పరిషత్‌ ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అధిక సంఖ్యలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు నిజమైన దీపావళిని ఆస్వాదిస్తున్నారు.

జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలుండగా, పూతలపట్టు, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఎన్నికలు జరిగిన 24 స్థానాల్లో 20 చోట కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో వైసీపీ గెలవగా, ఐరాలలో జనసేన విజయం సాధించింది. మిగిలిన 19 మండలాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. పెనుమూరు మండల జడ్పీటీసీ ఓట్లను శనివారం అర్ధరాత్రి దాటాక మరోసారి లెక్కిస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

జిల్లాలో 370 ఎంపీటీసీ స్థానాలుండగా, 70 ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 64 టీడీపీకి, 4 జనసేనకు, 1 బీజేపీకి, 1 వైసీపీకి దక్కాయి. ఎన్నికలు జరిగిన 300 స్థానాల్లో 218 చోట కూటమి అభ్యర్థులు గెలిచారు. వీరిలో 210 స్థానాల్లో టీడీపీ, 7 చోట జనసేన, ఓ చోట బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీకి 79 స్థానాలు దక్కాయి. జీడీనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, వి.కోట మండలాల్లో వైసీపీకి అధిక స్థానాలు లభించాయి. ముగ్గురు స్వతంత్రులు, రెబల్స్‌ ఉన్నారు.

జనసేనకు 1 జడ్పీటీసీ, 11 ఎంపీటీసీలు

జనసేన పార్టీకి రెండు జడ్పీటీసీ స్థానాలు కేటాయించగా, ఐరాలలో గెలిచారు. కార్వేటినగరంలో ఓడిపోయారు. కార్వేటినగరంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో జనసేనకు ఓ జడ్పీటీసీ స్థానమే దక్కింది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ సమయంలో 4 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, తాజా ఫలితాల్లో మరో 7 స్థానాలు ఆ పార్టీకి దక్కాయి. దీంతో మొత్తం 11 ఎంపీటీసీలు దక్కినట్లు అయింది. తాజాగా బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యం, గంగవరం, గుడిపాల, పాలసముద్రం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో ఒక్కోటి చొప్పున జనసేనకు దక్కాయి. ఏకగ్రీవమైన నాలుగు స్థానాలు బంగారుపాళ్యం, పులిచెర్ల, రామకుప్పం, యాదమరి మండలాల్లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

బీజేపీకి రెండు ఎంపీటీసీలు

రామకుప్పం మండలంలో గతంలోనే ఓ స్థానం బీజేపీకి ఏకగ్రీవం కాగా, తాజాగా కుప్పం మండలంలోని ఓ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ గెలిచింది. రెండు స్థానాలూ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే ఉండడం గమనార్హం. జిల్లాలో ఎక్కడా జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించలేదు.

జీడీనెల్లూరులో కూటమికి ఘోర పరాభవం

జీడీనెల్లూరు నియోజకవర్గంలో కూటమికి ఘోర పరాభవం జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడి ఆరు జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 5, జనసేన ఓ చోట పోటీ చేశాయి. మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓడిపోయారు. వెదురుకుప్పం, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులు గెలిచారు. పాలసముద్రంలో టీడీపీ గెలిచినా.. జీడీనెల్లూరులో తక్కువ ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బయట పడ్డారు. పెనుమూరులో కూడా వైసీపీ అభ్యర్థికి స్వల్ప ఓట్ల ఆధిక్యత రావడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి కోరిక మేరకు ఆదివారం ఓట్లను మళ్లీ లెక్కించనున్నారు.

అలాగే ఎస్‌ఆర్‌పురం ఎంపీపీ స్థానం కూడా జనసేనకు వెళ్లనుంది. ఇక్కడ 11లోని 9 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. జీడీనెల్లూరు మండలంలోని 19 స్థానాలకు ఎన్నిక జరిగితే వైసీపీ అభ్యర్థులు 8 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ కాకుండా జిల్లాలో మరే నియోజకవర్గంలో కూడా ఒక్క జడ్పీటీసీ అభ్యర్థి కూడా ఓడిపోలేదు.

కార్వేటినగరం, వెదురుకుప్పంలో క్రాస్‌ ఓటింగ్‌

వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఈ రెండు చోట్ల జడ్పీటీసీలుగా వైసీపీ అభ్యర్థులు గెలవగా.. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి దక్కాయి. కార్వేటినగరంలో 14లో 9 టీడీపీ, వెదురుకుప్పంలో 19లో 9 టీడీపికి దక్కాయి. దీంతో ఈ రెండు మండలాల ఎంపీపీ స్థానాలు టీడీపీకి లభించనున్నాయి.

Updated Date - Nov 08 , 2026 | 02:34 AM