తుది దశకు విద్యాశాఖలో జిల్లాల విభజన
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:07 AM
విద్యాశాఖలో జిల్లాల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ప్రిఫరెన్షియల్ క్యాటగిరి (మెడికల్, పీహెచ్, విడో...) కింద ఎంఈవోలు, హెచ్ఎంల నుంచి వచ్చిన 188 దరఖాస్తులను శుక్రవారం డీఈవో కార్యాలయంలో పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ వివరాలను కడప ఆర్జేడీకి పంపనున్నారు.
డిసెంబరు 2 తర్వాత టీచర్లకు ఆప్షన్లు
ఏప్రిల్ 22 వరకు ప్రస్తుత స్థానాల్లోనే..
23 నుంచి కొత్త జిల్లాల్లో బాధ్యతలు
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఇబ్బందులు రాకుండా చర్యలు
చిత్తూరు సెంట్రల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో జిల్లాల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ప్రిఫరెన్షియల్ క్యాటగిరి (మెడికల్, పీహెచ్, విడో...) కింద ఎంఈవోలు, హెచ్ఎంల నుంచి వచ్చిన 188 దరఖాస్తులను శుక్రవారం డీఈవో కార్యాలయంలో పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ వివరాలను కడప ఆర్జేడీకి పంపనున్నారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపుల కసరత్తు పూర్తి చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే.. డిసెంబరు 2 తర్వాత జిల్లాలను ఎంపిక చేసుకునేందుకు ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన టీచర్లు తాము ఏ జిల్లాలో ఉండాలని కోరుకున్నా, సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరగనున్నాయి. ఎంపికలో కొత్త జిల్లాలు వచ్చిన టీచర్లకు, వారు కోరుకున్న జిల్లాలో స్థానాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందులో తాము ఎంచుకున్న స్థానాలు వచ్చినప్పటికీ, వెంటనే విధుల్లో చేరాల్సిన అవసరం లేదు. విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చిన క్రమంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖకు సవాలుగా మారనుంది. ప్రస్తుత తరుణంలో విభజన ప్రక్రియలో ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు వెళితే.. బోధనకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆ ప్రకారం కొత్త జిల్లాలు కేటాయించినా, ఈ విద్యా సంవత్సరంలో.. 2027 ఏప్రిల్ 22 వరకు టీచర్లు వారి పాత స్థానాల్లోనే కొనసాగనున్నారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవుల నేపఽథ్యంలో 2026-27 విద్యా సంవత్సరం చివరి పనిదినమైన ఏప్రిల్ 23న కొత్త జిల్లాలకు కేటాయింపుల్లో భాగంగా వారి స్థానాల్లో విధుల్లో చేరాల్సి ఉంది.
ప్రస్తుతం
ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో వివిధ కేటగిరిల కింద 17,386 టీచర్లు/ఉద్యోగులను కేటాయించగా, 15,195 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాల వారీగా అన్నమయ్యలో 4,557కి గాను 4,014 మంది, చిత్తూరులో 7,848కి గాను 6,674 మంది, తిరుపతిలో 4,981కి గాను 4,507 మంది ఉద్యోగులు, టీచర్లు పనిచేస్తున్నారు.
ఆర్జేడీకి ప్రిఫరెన్షియల్ కేటాగిరి టీచర్ల వివరాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి ప్రిఫరెన్షియల్ క్యాటగిరి కింద తిరుపతిలోని రుయాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎంఈవోలు, హెచ్ఎంలకు సంబంధించి మెడికల్, అంగవైకల్యం, వితంతు తదితర విభాగాలకు సంబంధించి 188 దరఖాస్తులు రాగా, వీటిని శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరిశీలిస్తున్నారు. అనంతరం దరఖాస్తుతో పాటు ఇతర వివరాలను కడప ఆర్జేడీకి పంపనున్నారు.