డిజిటలైజేషన్‌లో జిల్లా వెనుకంజ
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:05 AM
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది
- తిరుపతి(కలెక్టరేట్), జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ వందశాతం పూర్తి కావస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నాటికి ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది మాత్రం 53.29శాతమే. బీఎల్వోల ఇంటింటి ఓటర్ల పరిశీలన ఈనెల 14వ తేదీతో ముగియనుంది. అప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 17,69,438 మంది ఓటర్లు ఉన్నారు. 2,099మంది బీఎల్వోలు సర్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయి పర్యటనలో కొంతమంది తహసీల్దార్లు (ఏఈఆర్వోలు), బీఎల్వోల నిర్లక్ష్యం బయటపడింది. కొంతమందిని సస్పెండ్ చేయగా మరికొందరికి చార్జి మెమోలు కూడా ఇచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో బీఎల్వోల పనితీరు మరింత అధ్వానంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో 41శాతమే నమోదు కావడంపై కలెక్టర్ వెంకటేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆదివారం నాటికి కేవలం 9,42,872 ఎన్యూమరేషన్ ఫారాలు (53.29శాతం) డిజిటలైజేషన్ అయ్యాయి. కాగా, ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఓటర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వివాహమైన మహిళలు 2002 జాబితాలో ఓటు కోసం అన్వేషించడం కష్టతరంగా మారింది. అలాగే నగరాలకు వలస వచ్చినవారి పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది.
చంద్రగిరి, తిరుపతికి నోడల్ ఆఫీసర్ల నియామకం
చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ తిరుపతి నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ గోవిందరావు, చంద్రగిరికి డీఆర్వో నరసింహులును నోడల్ అధికారులుగా నియమించారు.
రేపు రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష
జిల్లాలో సర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరగడానికి పరిశీలకుడు(రోల్ అబ్జర్వర్)గా ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నియమించారు. ఈయన మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.