Share News

సమగ్ర ఉద్యాన కేంద్రంగా జిల్లా

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:45 AM

సమగ్ర ఉద్యాన కేంద్రంగా (గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌)గా జిల్లా మారనుంది. ‘రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక’లో భాగంగా జిల్లాకు రూ.1,529.69 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో ఉద్యాన పంటల అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. మూడేళ్ల వ్యవధిలో జిల్లాలోని 27 మండలాల పరిధిలో 20 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు.

సమగ్ర ఉద్యాన కేంద్రంగా జిల్లా

రూ.1529.69 కోట్లతో భారీ ప్రణాళిక

20 హార్టికల్చర్‌ క్లస్టర్ల అభివృద్ధి

రేపు మదనపల్లెలో ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

చిత్తూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఉద్యాన కేంద్రంగా (గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌)గా జిల్లా మారనుంది. ‘రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక’లో భాగంగా జిల్లాకు రూ.1,529.69 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో ఉద్యాన పంటల అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. మూడేళ్ల వ్యవధిలో జిల్లాలోని 27 మండలాల పరిధిలో 20 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రారంభించనున్నారు.

రైతు ఆదాయమే లక్ష్యంగా..

ఉద్యాన పంటల సాగులో ఉత్పాదకత పెంచడంతో పాటు మెరుగైన మార్కెట్‌, నాణ్యత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్‌, ఎగుమతి సదుపాయాలను కల్పించడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. పంట ఉత్పత్తి నుంచి మార్కెటింగ్‌, ఎగుమతుల వరకు మొత్తం విలువ ఆధారిత సరఫరా వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ఇక, రూ.1,529.69 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో అత్యధికంగా రూ.620.40 కోట్లను మైక్రో ఇరిగేషన్‌కు కేటాయించడం విశేషం. బిందు, తుంపర సేద్యం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి ఉద్యాన రైతులకు ప్రయోజనం కల్పించనున్నారు. రాయలసీమలోని నీటి లభ్యత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు.

20 క్లస్టర్లు.. మూడు దశలు

2026-27 నుంచి 2028-29 వరకు మూడు దశల్లో క్లస్టర్ల అభివృద్ధి చేపట్టనున్నారు. తొలి దశలో (2026-27 ఆర్థిక సంవత్సరం) 5 క్లస్టర్లను.. ఏడు మండలాల్లో ఏర్పాటు చేయనున్నారు. పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, రామకుప్పం, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాలు ఈ దశలోకి వస్తాయి.

రెండో దశలో (2027-28) 8 క్లస్టర్లను 7 మండలాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో పెద్దపంజాణి, గంగవరం, పులిచెర్ల, రొంపిచెర్ల, బంగారుపాళ్యం, తవణంపల్లె, ఐరాల మండలాలు ఉన్నాయి.

మూడో దశలో (2028-29) 7 క్లస్టర్లను 13 మండలాల్లో ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు, గుడిపాల, పూతలపట్టు, యాదమరి, వెదురుకుప్పం, పెనుమూరు, జీడీనెల్లూరు, పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, నగరి, నిండ్ర, విజయపురం మండలాలు ఈ దశలోకి వస్తాయి.

సాగు నుంచి ఎగుమతుల వరకు..

క్లస్టర్ల పరిధిలో డిమాండ్‌కు అనుగుణంగా విదేశీ పండ్లు, వాణిజ్య కూరగాయలు, పూలు, ఆయిల్‌పాం వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. పాత తోటల పునరుద్ధరణ, కత్తిరింపులు, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, సమగ్ర సస్యరక్షణ విధానాలు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే, ఉద్యాన పంటల్లో కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించేందుకు ప్రీకూలింగ్‌ కేంద్రాలు, కోల్డ్‌ స్టోరేజీలు, రైపనింగ్‌ ఛాంబర్లు, శీతలీకరణ రవాణా వాహనాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లను అందుబాటులో తీసుకురానున్నారు. దీంతో పంటను వెంటనే తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితిని తగ్గించే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.

గ్రామస్థాయిలోనే మార్కెట్‌ సదుపాయాలు

రైతులు పండించిన పంటలకు మెరుగైన ధర లభించేలా గ్రామీణస్థాయిలో కలెక్షన్‌, కన్సాలిడేషన్‌ కేంద్రాలతో పాటు గ్రేడింగ్‌, సార్టింగ్‌, ప్యాకింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్‌ ధరల ప్రదర్శన బోర్డులు, మార్కెటింగ్‌, లాజిస్టిక్స్‌ సదుపాయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌పై గురి

జిల్లాలో ఉద్యాన పంటలకున్న సాగు అవకాశాలను మరింత విస్తరించి, ఉత్పత్తి నాణ్యతను పెంచి, కోత అనంతర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా రైతులను అంతర్జాతీయ మార్కెట్లలో అనుసంధానం చేయడమే ప్రణాళిక అంతిమ లక్ష్యంగా ఉంది. ఉత్పత్తి, మార్కెటింగ్‌, ఎగుమతులు అనే సమగ్ర విధానంతో చిత్తూరు ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

Updated Date - Oct 01 , 2026 | 01:45 AM