రైతులకు పాసుపుస్తకాల నమూనా డ్రాఫ్టుల పంపిణీ
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:26 AM
ఫొటో మీదేనా? సర్వే నెంబరు, మీకున్న విస్తీర్ణం వివరాలు సరిపోయాయా? ఈ పేపర్లలో ఉండే వివరాలు ఒకసారి చెక్ చేసుకుని చెప్పండి. అంతా కరెక్టుగా ఉంటే.. ఇలాగే మీకు పాస్‌పుస్తకం వస్తుంది. ఇలా రీసర్వే జరిగిన గ్రామాల్లో తప్పుల్లేకుండా పాస్ పుస్తకాలిచ్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
ఫొటో మీదేనా? సర్వే నెంబరు, మీకున్న విస్తీర్ణం వివరాలు సరిపోయాయా? ఈ పేపర్లలో ఉండే వివరాలు ఒకసారి చెక్ చేసుకుని చెప్పండి. అంతా కరెక్టుగా ఉంటే.. ఇలాగే మీకు పాస్‌పుస్తకం వస్తుంది. ఇలా రీసర్వే జరిగిన గ్రామాల్లో తప్పుల్లేకుండా పాస్ పుస్తకాలిచ్చే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
- చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి
వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 329 గ్రామాల్లో రీసర్వే జరిగింది. 90,287 మంది రైతులకు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అప్పటి సీఎం జగన్ ఫొటోలతో పాస్‌పుస్తకాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో పాస్‌పుస్తకాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీ మేరకు ఇటీవల రాజముద్రతో ఉన్న 78 వేల పాస్‌పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పంపిణీ చేపట్టగా.. దాదాపు 38 వేల పాస్‌పుస్తకాల్లో సర్వే నెంబర్లు, విస్తీర్ణం, ఖాతా నెంబరు, రైతుల ఫొటోల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించారు. వీటి పంపిణీని ఆపేసి వెనక్కి పంపేశారు. రైతులు దరఖాస్తు చేసుకుంటే తప్పులు సరిదిద్దుతామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తప్పుల్లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రకారం.. ఫిబ్రవరి 9న చిత్తూరు డివిజన్‌లోని నాలుగు మండలాల పరిధిలో 5 గ్రామాల్లో తప్పుల్లేకుండా పాస్‌పుస్తకాలు ఇచ్చేలా కసరత్తు చేపట్టారు. ఈ డివిజన్‌లో 1309 పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. అందులో ప్రాథమికంగా తప్పుల్లేనివి 471గా గుర్తించారు. ఈ పాస్‌పుస్తకాల నమూనా డ్రాఫ్టులను ప్రింట్ తీసి తుది పరిశీలన నిమిత్తం రైతులకు అందజేశారు. ఈ డ్రాఫ్టులో ఉన్నట్లే మీ ఫొటోతో పాటు వివరాలతో పాస్‌పుస్తకం వస్తుందని చెబుతున్నారు. మరోసారి చెక్‌చేసి వివరాలన్నీ కరెక్టుగా ఉన్నాయంటే పాస్‌పుస్తకం ప్రింటింగ్‌కు పంపిస్తామని అంటున్నారు. ఇలా రైతులు డ్రాఫ్టులను చూసి తమ వివరాలు సరిగ్గా ఉన్నాయని చెప్పాక ఈకేవైసీ చేస్తున్నారు. ఇలా ఇప్పటికి 300 వరకు ఈకేవైసీ పూర్తిచేసి.. ప్రింటింగ్‌కు పంపించారు. ఈ పాస్‌పుస్తకాలన్నీ ముద్రణ పూర్తయి ఫిబ్రవరి మొదటి వారంలో చిత్తూరుకు వస్తాయి. తర్వాత పంపిణీ చేస్తారు. ఒకవేళ వీటిలోనూ తప్పులు దొర్లితే సంబంధిత రైతులు అర్జీలు సమర్పిస్తే వాటిని పునఃపరిశీలించి.. మళ్లీ ముద్రణ పూర్తి చేసి మార్చిలో అందజేస్తారు.
ఆ ఐదు గ్రామాలివే
చిత్తూరు రూరల్ మండలంలోని శెట్టింతంగళ్, అరతల.. పూతలపట్టు మండలం చిటిపిరాళ్ల.. యాదమరి మండలంలోని ముద్దరామాపురం.. ఎస్‌ఆర్ పురం మండలంలోని ముచ్చలమర్రి గ్రామాలు.
తప్పులు సరిదిద్దుకునేందుకు రాని రైతులు
చిత్తూరు డివిజన్ పరిధిలో తప్పుల్లేనివి 471 పాస్‌పుస్తకాలైతే.. మిగిలిన 838 మందికి సంబంధించి తప్పులున్నాయి. ఈ రైతుల్లో చాలామంది బెంగళూరులో స్థిరపడ్డారు. తప్పులను సరిదిద్దుకోవాలంటే గ్రామసచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వారిలో చాలా మంది రైతులు కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు.
డ్రాఫ్ట్‌లు అందజేశాం
తప్పుల్లేని పాసుపుస్తకాలు అందజేయాలనేది మా లక్ష్యం. అందుకు ముందుగానే రైతుల పాసుపుస్తకాల నమూనాతో ఉన్న డ్రాఫ్ట్‌ను సంబంధిత రైతులకు అందజేస్తాం. అందులో తప్పులు లేవని వాళ్లు నిర్ధారిస్తే ప్రింటింగ్‌కు పంపి పంపిణీ చేస్తాం.
- శ్రీనివాసులు, చిత్తూరు ఆర్డీవో