Share News

సదరం కేంద్రం అవినీతిపై పంచాయితీ

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:43 AM

శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా జరిగిన మరో అవినీతి బాగోతమిది.

సదరం కేంద్రం అవినీతిపై పంచాయితీ

శ్రీకాళహస్తి,సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా జరిగిన మరో అవినీతి బాగోతమిది.ఆస్పత్రిలోని సదరం కేంద్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులే కొనసాగుతుండడంతో అవినీతి వేళ్లూనుకుపోయింది. 2023లో సదరం కేంద్రంలో ఓ వైద్యాధికారి కంప్యూటర్‌ ఆపరేటర్‌తో కలిసి సర్టిఫికెట్ల జారీ కోసం అవకతవకలకు పాల్పడడంపై పక్కా ఆధారాలతో అప్పటి అధికారులకు ఫిర్యాదుచేశారు. అలా రెండు సార్లు ఆ అధికారిపై విచారణ జరిగింది.అదే శాఖకు సంబంధించిన అధికారులు విచారణకు హాజరు కావడంతో ఫిర్యాదుదారులతో కలిసి భోంచేసి సమస్యను అటకెక్కించారు.సదరం కేంద్రానికి వచ్చే బాధితుల ఫోన్‌ నెంబర్లను ఇక్కడ పనిచేసే కొందరు సిబ్బంది సేకరించేవారు.నెలల తరబడి సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ చేయకుండా పెండింగ్‌లో పెట్టేవారు. ఆ తరువాత సర్టిఫికెట్ల కోసం ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణ చేసేవారిని ఫోన్‌లో వీరి ఏజెంటు సంప్రదించి బేరం కుదుర్చుకునేవారు. ఆస్పత్రితో సంబంధం లేకుండా బయటి వ్యక్తి డబ్బులు అందుకున్న తరువాత ఇక్కడ పనిచేసే అధికారి తనకు ఏం సంబంధం లేనట్లు సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసే తంతు వైసీపీ హయాంలో సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ దందాపై అధికారులు, పాలకులు నిఘా పెట్టారు. అయితే కొద్ది నెలలుగా పాత తరహాలో ఓ కీలక అధికారి అండతో రహస్య దందాకు తెరలేపినట్లు సోమవారం బయటపడింది.కడపకు చెందిన వ్యక్తి శ్రీకాళహస్తి సదరం కేంద్రంలో వైద్యపరీక్షలకు హాజరయ్యాడు. గతంలో లాగే ఓ ఏజెంట్‌ అతడిని సంప్రదించి రూ.13వేలు ఫోన్‌పే ద్వారా స్వీకరించారని సమాచారం.ఆస్పత్రిలో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసే సమయంలో పొరబాటున నాట్‌ ఎలిజిబుల్‌ పడింది. దీంతో నగదు చెల్లించిన బాధితుడు ఏజెంటును నిలదీశాడు. దీంతో సదరం కేంద్రంలో పనిచేసే వైద్యాధికారి సర్టిఫికెట్‌ మార్పు కోసం సంబంధిత శాఖ అధికారులకు మెయిల్‌ పంపారు. వారి అనుమతితో మళ్లీ వైకల్యం శాతాన్ని మార్చి పెన్షన్‌కు అర్హత కలిగించేలా సర్టిఫికెట్‌ను నమోదు చేశారు. అయితే సదరం ఉన్నతాధికారులు ఎందుకు సర్టిఫికెట్‌ మార్చారన్న అనుమానంతో విచారణ జరిపినట్లు తేలింది.దీంతో రూ.13వేలు సదరం కేంద్రం అధికారితో చనువుగాఉండే వ్యక్తికి ఫోన్‌పే ద్వారా వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆస్పత్రి ముఖ్య అధికారి మంగళవారం సదరం కేంద్రం ఇన్‌ఛార్జితో పాటు ఏజెంటును ఆస్పత్రికి పిలిపించి పంచాయితీ చేసినట్లు తెలిసింది.అక్రమాలు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇలా ఆరోగ్యశ్రీలో పంచాయితీలు జరపడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Sep 23 , 2026 | 12:43 AM