బిల్లులకు డిజిటల్ చెల్లింపులే
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:35 AM
16వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో పారదర్శకతకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి: ‘చెక్’బుక్కుల్లేవు. నేరుగా నగదు తీసుకోవడమూ కుదరదు. చేసిన ప్రతి పనికీ.. డిజిటల్ విధానంలోనే బిల్లులు చెల్లించాలి. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనలను కఠినతరం చేసింది.
గత ఆర్థిక సంవత్సరంతో 15వ ఆర్థిక సంఘం ముగిసింది. ఇక 16వ ఆర్థిక సంఘం నిధులు 2026 నుంచి 2031 వరకు.. ఏటా రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు ఈ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి. అయితే పంచాయతీలు, మండల, జిల్లాపరిషత్‌లకు ఎన్నికలు జరిగే వరకు నిధులు విడుదల కావన్న వాదన ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు చివరి మూడు విడతలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆర్థిక పరిపుష్టినిచ్చే ఈ నిధులు, స్థానిక సంస్థల చేజారకుండా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కాగా, ఆర్థిక సంఘం నిధులకు గతంలోనూ ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరిచారు. అలాగే ఇప్పుడూ 16వ ఆర్థిక సంఘం నిధులకు తక్షణమే ప్రత్యేక బ్యాకు ఖాతాలను ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మార్గదర్శకాలు జారీచేశారు. ప్రతి పంచాయతీ, ఎంపీపీ, జడ్పీటీసీ తమ డిజైన్డ్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) పేరుతో యూనియన్ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. గత 15వ ఆర్థిక సంఘం ఖాతా ఏ శాఖలో ఉందో.. అందులోనే ఈ కొత్త ఖాతా కూడా ప్రారంభించాలి. పీఎ్‌ఫఎంఎస్ పోర్టల్‌లో ప్రస్తుత డీడీవో ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయాలి. కొత్తగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా వివరాలను పీఎ్‌ఫఎంఎస్, గ్రామ స్వరాజ్ పోర్టర్స్ రెండింటిలోనూ నమోదుచేసి, ఇంటర్‌ఫేస్ ప్రక్రియను పూర్తిచేయాలి.
నిధుల దుర్వియోగానికి తావు లేకుండా..
ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగానికి తావులేకుండా ఈ ఖాతాలపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిది. ఈ ఖాతాలకు చెక్‌బుక్‌లు జారీచేయరు. అంటే, చెక్కులు లేదా నగదు డ్రా చేసుకోవడానికి అనుమతి లేదు. ఇతర డిపాజిట్లను ఈ ఖాతాలో వేయకూడదు. ప్రతి చెల్లింపునూ కచ్చితంగా ఈగ్రామస్వరాజ్.. పీఎ్‌ఫఎంఎస్ డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారానే జరపాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుమతించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిధులను ఖర్చు చేయాలి.
జిల్లాకు సంబంధించి..
జిల్లాకు 2025-26లో రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేయలేదు. తొలి విడతలో రూ.28.52 కోట్లు విడుదల చేసింది. అందులో టైడ్ విభాగంలో రూ.17,11,22,917 తో పాటు అన్‌టైడ్ విభాగంలో రూ.11,40,81,966 మాత్రమే విడుదలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల రూపేణా తొలివిడతగా రూ.29.24 కోట్లు వచ్చాయి. అందులో టైడ్ విభాగానికి రూ.17,54,98,705.. అన్‌టైడ్ విభాగానికి రూ.11,69,98,977 విడుదలయ్యాయి. రెండో విడతగా రూ.30.32 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇందులో టైడ్ విభాగానికి రూ.18,19,64,239 రాగా, అన్‌టైడ్ విభాగానికి రూ.12,13,09,481 విడుదల జరిగింది.