10 పంచాయతీల్లో డీజిల్ ఖర్చు రూ.56.47 లక్షలట!
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:17 AM
మండల కేంద్రమైన వి.కోట పంచాయతీలో రూ.32.48 లక్షల డీజిల్ వాడారట. అలాగని స్వర్ణ పంచాయతీ మాడ్యూల్‌లో (కంటింజెంట్ హెడ్) బిల్లులు పెట్టారు. ఇలా పది పంచాయతీల్లో డీజిల్ ఖర్చు కింద 56.47 లక్షల రూపాయలను డ్రా చేసేశారు. ఇతర పనుల బిల్లులను ఎవరికీ అనుమానం రాకుండా ఈ పెట్రోల్, డీజిల్ ఖర్చుల మాడ్యూల్‌లో పెట్టి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ వ్యవహారాన్ని కమిషనరు కార్యాలయం గుర్తించింది. దీంతో ఈ పది పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ఆ పదిమంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
మిగిలిన పంచాయతీల్లోనూ ఇంతేనా?
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన వి.కోట పంచాయతీలో రూ.32.48 లక్షల డీజిల్ వాడారట. అలాగని స్వర్ణ పంచాయతీ మాడ్యూల్‌లో (కంటింజెంట్ హెడ్) బిల్లులు పెట్టారు. ఇలా పది పంచాయతీల్లో డీజిల్ ఖర్చు కింద 56.47 లక్షల రూపాయలను డ్రా చేసేశారు. ఇతర పనుల బిల్లులను ఎవరికీ అనుమానం రాకుండా ఈ పెట్రోల్, డీజిల్ ఖర్చుల మాడ్యూల్‌లో పెట్టి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ వ్యవహారాన్ని కమిషనరు కార్యాలయం గుర్తించింది. దీంతో ఈ పది పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇలా అడ్డదారిలో నిధులు డ్రా చేయడంతో, ఇంతకీ ఆ పనులు జరిగాయా లేదా తూతూమంత్రంగా చేసి బిల్లులు చేసుకున్నారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. నిధుల వ్యయానికి సంబంధించి మూడు రకాల మాడ్యూళ్లను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నుంచి ఈ మాడ్యూళ్లను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో పెట్టారు. ప్రభుత్వం సూచించిన మేరకు.. ఆయా పనులకు సంబంధించిన బిల్లులను ఆ మాడ్యూళ్లలోనే పంచాయతీ కార్యదర్శులు అప్‌లోడ్ చేయాలి. వాటిని పరిశీలించాక సీఎ్‌ఫఎంఎస్ ద్వారా చెల్లింపులు చేస్తారు. దీని ప్రకారం ఒక పనికి సంబంధించిన బిల్లులు రావాలంటే.. గ్రామపంచాయతీ తీర్మానం, టెండరు నోటీసు, వర్క్ కమిటీ ఆమోదం, వర్క్ ఆర్డర్, సాంకేతిక ఆమోదం, పరిపాలన ఆమోదం, ఎం-బుక్ వర్క్ ఎంట్రీలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను తప్పనిసరిగా స్వర్ణపంచాయతీ పోర్టల్‌లోని వర్క్స్, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ మాడ్యూల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇందులో ఏ ఒక్కటి జతపరచకపోయినా, సక్రమంగా అప్‌లోడ్ చేయకపోయినా ఆ బిల్లులు పాస్ కావు. ఈ మాడ్యూళ్లను అమలు చేయడం ద్వారా పంచాయతీల్లో అక్రమాలు, అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
నిబంధనలను గాలికొదిలి..
పదవీకాలం ముగిసేముందు కొందరు సర్పంచులు అధికారులతో కలిసి తప్పుడు బిల్లులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. కాలువలు, తాగునీటి పైపులైన్లు, మోటార్లు రిపేర్లు చేసినట్లు, వీధి దీపాలు, బ్లీచింగ్ కొన్నట్లు చూపారన్నది విమర్శ. కాగా, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినప్పటి నుంచి బిల్లులు నిలిపేశారు. వీటి చెల్లింపులకు ఇటీవల అవకాశం కల్పించారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులను నిబంధనల ప్రకారం వర్క్స్, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ మాడ్యూల్‌లో అప్‌లోడ్ చేయాలి. అలా చేస్తే వాటిని కమిషనరు కార్యాలయ అధికారులు పరిశీలించి పాస్ చేయాలి. దీంతో అవకతవకలు బయటపడతాయని భావించి, పెట్రోల్, డీజిల్ ఖర్చుల మాడ్యూల్‌లో అప్‌లోడ్ చేసేశారు. బిల్లుల చెల్లింపులూ జరిగిపోయాయి.
అలా దొరికిపోయారు
డీజిల్ మాడ్యూల్‌లో భారీగా నిధులు డ్రా చేయడంపై కమిషను కార్యాలయం ఆరా తీసింది. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. అలా జిల్లాలో పది పంచాయతీల వ్యవహారం వెలుగు చూడగా, ఆ కార్యదర్శులకు గురువారం డీపీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను తీసుకురావాలని ఆదేశించారు. ఈ చర్యతో.. ఇదే తరహాలో బిల్లులు అప్‌లోడ్ చేసిన మిగిలిన పంచాయతీ కార్యదర్శుల్లోనూ ఆందోళన నెలకొంది. ‘పంచాయతీల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. బిల్లులు కావాలంటే వాటిని పాటించాల్సిందే’నని డీపీవో - సుధాకర్‌రావు స్పష్టంచేశారు.
పది పంచాయతీల బిల్లుల లెక్క ఇదీ
-----------------------------------------------------------------------------------------------
మండలం పంచాయతీ డీజల్ (రూ.ల్లో)
-------------------------------------------------------------------------------------------------
బైరెడ్డిపల్లె బైరెడ్డిపల్లె 1,29,593
కార్వేటినగరం కార్వేటినగరం 1,36,011
పులిచెర్ల కల్లూరు 1,08,071
పూతలపట్టు పూతలపట్టు 13,97,187
పూతలపట్టు తిమ్మిరెడ్డిపల్లి 1,29,132
రొంపిచెర్ల రొంపిచెర్ల 1,18,301
వెదురుకుప్పం నల్లవెంగనపల్లి 1,43,424
వెదురుకుప్పం పచ్చికాపలం 1,37,586
వి.కోట కృష్ణాపురం 1,00,000
వి.కోట వి.కోట 32,48,589